పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ మేఘాలు ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉన్న దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడింది. గత ఐదేళ్లుగా అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చిన దుబాయ్ ప్రాపర్టీ సేల్స్, 2026 మార్చి నాటికి అనూహ్యంగా 49 శాతం వరకు పడిపోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల భద్రతపై పునరాలోచనలో పడ్డారు.
దుబాయ్‌లో విదేశీ పెట్టుబడిదారుల్లో భారతీయుల వాటా సుమారు 20-22 శాతం వరకు ఉంటుంది. అయితే, ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల అక్కడి సేఫ్ హెవెన్ అనే ముద్రకు గండిపడింది. దీంతో గల్ఫ్ దేశాల్లోని ఎన్నారైలు , సంపన్న భారతీయ ఇన్వెస్టర్లు తమ మూలధనాన్ని సురక్షితమైన స్వదేశీ మార్కెట్లకు మళ్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో లగ్జరీ ప్రాపర్టీలకు ఎంక్వైరీలు ఒక్కసారిగా పెరిగాయి.
భారతదేశం ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా స్థిరంగా ఉండటంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఇది ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతం , బెంగళూరులోని ప్రీమియం సెగ్మెంట్లలో విదేశీ భారతీయుల పెట్టుబడులు పెరుగుతున్నాయి. దుబాయ్‌లో అద్దె రాబడి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రాణ ఆస్తి నష్టం భయం కంటే స్థిరమైన స్వదేశీ వృద్ధే మేలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం భారతీయ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా కలిసివచ్చే అంశంగా మారింది. దుబాయ్ మార్కెట్లో లావాదేవీల విలువ సగానికి పడిపోవడం, అక్కడి ప్రముఖ డెవలపర్ల షేర్లు కుప్పకూలడం వంటి పరిణామాలు భారతీయ మార్కెట్ వైపు పెట్టుబడుల ప్రవాహాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఒకవేళ యుద్ధ ఉద్రిక్తతలు మరింత కాలం కొనసాగితే, హైదరాబాద్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది.
