హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది. ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ పెరగడంతో నివాస గృహాల ధరలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి. అయితే సాధారణ బిల్డర్లు నిర్మించే స్టాండ్ అలోన్ అపార్టుమెంట్లు ఇప్పటికీ మధ్యతరగతికి అందుబాటులో ఉన్నాయి. ఈ అపార్టుమెంట్లు సగటున 2BHK ఫ్లాట్ ధరలు ప్రాంతాన్ని బట్టి 45 లక్షల నుంచి 80 లక్షల వరకు పలుకుతున్నాయి.
గేటెడ్ కమ్యూనిటీలు కాకుండా చిన్న అపార్టుమెంట్లపై దృష్టి సారించే మధ్యతరగతి కొనుగోలుదారులకు ఇంకా కొన్ని ప్రాంతాలు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి.
పశ్చిమ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లకు దూరంగా ఉన్న శివారు ప్రాంతాలు ప్రస్తుతం బడ్జెట్ కొనుగోలుదారులకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. పటాన్చెరు, ఇస్నాపూర్, ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.3,500 నుంచి ₹రూ.,800 మధ్య ఉంది. ఇక్కడ చిన్న అపార్టుమెంట్లలో 2BHK ఫ్లాట్లు రూ.40 లక్షల నుంచి రూ.55 లక్షల లోపు లభిస్తున్నాయి. ఇండస్ట్రియల్ హబ్ , ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో మధ్యతరగతి వర్గాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఉత్తర , తూర్పు హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ధరలు కొంత మేర అందుబాటులోనే ఉన్నాయి. మేడ్చల్, ఘటకేసర్, ఉప్పల్, ఎల్బీనగర్ పరిసరాల్లోని చిన్న బిల్డర్ల ప్రాజెక్టులలో 2BHK ధరలు రూ.50 లక్షల నుంచి రూ.65 లక్షల మధ్య ఉన్నాయి. ముఖ్యంగా ఘటకేసర్ , ఆదిభట్ల వంటి ప్రాంతాల్లో ఐటీ పార్కులు, ఏరోస్పేస్ సెంటర్లు పెరుగుతున్నప్పటికీ, భూమి ధరలు పశ్చిమ హైదరాబాద్‌తో పోలిస్తే తక్కువగా ఉండటంతో ఇక్కడ ఫ్లాట్లు తక్కువ ధరకే వస్తున్నాయి.
శివారు ప్రాంతాల్లోని చిన్న అపార్టుమెంట్లు సామాన్యులకు భరోసానిస్తున్నాయి. అయితే కొనుగోలు చేసే ముందు చట్టపరమైన అనుమతులు, ముఖ్యంగా HMDA , GHMC నిబంధనల ప్రకారం నిర్మాణం జరుగుతుందో లేదో సరిచూసుకోవడం అత్యవసరం.
