ఎడిటర్స్ కామెంట్ : పాలకులు దేవుళ్లు – ప్రజలు సేవకులా ?

” కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేయి.. కన్ఫ్యూజ్ కూడా చేయలేకపోతే స్వర్గంలో ఉన్నామన్న భావన కల్పించు ” అన్నట్లుగా ఉంది మన దేశంలో పాలక పార్టీల తీరు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అటు కేంద్రం.. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రచార ఉద్యమాలు చేస్తున్నాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే.. మేము అధికారం చేపట్టక ముందు మీరంతా తిండి, నీళ్లు, గూడు లాంటివేమీ లేకుండా ఉన్నారు. మేము అధికారం చేపట్టాకే మీకు కాసింత అవి దక్కుతున్నాయని చెబుతున్నారు. నమ్మిస్తున్నారు కూడా. ఢిల్లీలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయింది. ఈ సందర్భంగా కేంద్రం, బీజేపీ చేస్తున్న్ ప్రచారాలు .. అబ్బా మన దేశంలో అమెరికాను మించిపోయిందా అని చూసే వారికి ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. తెలంగాణ సర్కార్ కూడా అంతే. సీఎం కేసీఆర్ పదవి చేపట్టి తొమ్మిదేళ్లయింది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లయింది. అయితే ఇప్పుడే పదేళ్లయిపోయినట్లుగా కేసీఆర్ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. బంగారు తెలంగాణ అయిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీ సర్కార్ కూడా ప్రచార ఉద్యమాలు చేస్తోంది కానీ.. తెలంగాణ, కేంద్రంలా వ్యవస్థీకృతంగా చేయడంలో విఫలమవుతోంది. అక్కడ పాలకులకు సొంత సమస్యలు, పగ, ప్రతీకారాల ఎజెండాలతో అక్కడి రాజకీయంలో ప్రచారాస్త్రం భిన్నమైన కోణంలో సాగుతోంది.

అభివృద్ధి చెందిన దేశాల్లో భారత్ ను చేర్చేస్తున్న బీజేపీ!

ప్రధాని మోదీ పాలనా పగ్గాలు చేపట్టి 9 ఏళ్లు అయిన సందర్భంగా నవ వసంతం – నవ కుసుమాలు పేరిట నెల రోజుల పాటు ఇంటింటికి వెళ్లి .. మోదీ దేసం కోసం సాదించుకొచ్చిన ట్రోఫీల గురించి ప్రచారం చేయనున్నారు. మోదీ అంతగా ఏం సాధించారో ఎవరికీ తెలియదు. అందుకే అలాంటి ట్రోఫీలు ఎవరికీ కనిపించవు. కానీ ఆ ఇన్విజిబుల్ ట్రోఫీలను ప్రజలకు చూపించి.. ఓ మయాలోకంలో విహరింపచేయడానికి బీజేపీ యంత్రాంగం అంతా రంగంలోకి దిగిపోయింది. ఇప్పుడు బీజేపీ నేతలు చేసే ప్రచారం ఎలా ఉందంటే.. బారత్ కాళ్ల దగ్గర అమెరికా ఉంది. దేశంలో పేదరికమే లేదు. అందర్నీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. పరిశ్రమలన్నీ వెల్లువలా వస్తున్నాయి. ఉద్యోగాల విప్లవం జరుగోతంది. అవినీతే జరగడంలేదు. అవినీతి పరులందరూ జైళ్లకు వెళ్లారు. ఆర్థిక వ్యవస్థ జిగేల్ మంటోంది. దేశంలో అన్ని ప్రాంతాల మధ్య సఖ్యత ఉంది. దేశ ప్రజల మధ్య విభజనఅనేదేలేదు… అన్నట్లుగా ప్రచారం చేస్తోంది. దేశం సస్యశ్యామలం అయిపోయిందని.. ఇదంతా మోదీ ఘనతేనని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ బీజేపీ లెన్స్ నుంచి కాస్త తలపైకెత్తి చూస్తే.. ఇదేనా నా నాదేశం అని సగటు భారతీయుడు ఆవేదన చెందకుండా ఉండడు.

దేశంలో ఎవరూ ఊహించనంత దుర్భర పరిస్థితులు !

ఓ వైపు మణిపూర్ తగలబడిపోతోంది. అక్కడ చిచ్చు పెట్టింది రాజకీయమే. ఓట్ల కోసం చేసిన రాజకీయం చిచ్చు పెడితే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. చేసిందంతా చేసి తీరిగ్గా వెళ్లిన హోంమంత్రి అమిత్ షా చర్చలే పరిష్కారం అని సెలవిచ్చారు. ఆ మంటలు ఎప్పుడు చల్లారుతాయో చెప్పడం కష్టం.. అవి ఈశాన్యాన్ని దహించి వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ మార్క్ రాజకీయాలు అలాంటి విభజన మంటల వల్లే వచ్చాయి. బీజేపీ ఎదడానికి ఆ మంటలే కారణం. మణిపూర్ నుంచి ప్రారంభిస్తే.. దేశంలో అటు రాజకీయంగా కానీ ఇటు దర్యాప్తు సంస్థలు కానీ.. అటు వ్యవస్థల దుర్వినియోగం అలజడి కానీ లేని రాష్ట్రాలు లేనేలేవంటే అతిశయోక్తి కాదు. దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీలో గ్యాంగ్ స్టర్లను అందరి ముందు అడ్డగోలుగా చంపేస్తూ ఉంటారు. చట్టాలు.. న్యాయాలు ఉండవు. అలాంటివి చూపించి అధికార అరాచకాలు చేసేవారు చెలరేగిపోతూంటారు. ఇలాంటి చోట్ల ముందు ముందు శాంతిభద్రతలు ఎలా ఉంటాయో అంచనా వేయడం పెద్ద కష్టం కాదు.వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయి. అత్యంత దారుణమైన హత్య కేసుల్లో నిందితులు.. అరెస్ట్ తప్పించుకోవడానికి కూడా చేయకూడని పనులు చేసినట్లుగా కళ్ల ముందు కనిపిస్తున్నా సీబీఐ అరెస్ట్ చేయలేని నిస్సహాయతత్వం కనిపిస్తోంది. దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ ప్రత్యర్థులపైనే ఎగబడుతున్నాయి. సొంత పార్టీలకు చెందిన అనేక మంది తీవ్రమైన నేరాల్లోు ఉన్నా రక్షణ పొందుతున్నారు. అడ్డగోలు స్కామ్‌లకు ప్రభుత్వాలు.. ప్రభుత్వాల్లో కీలక పాత్రల్లో ఉన్న వారు పాల్పడుతున్న కళ్ల ముందు కనిపించే సాక్ష్యాలున్నా కళ్లు మూసుకుంటున్నారు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్ని ప్రభుత్వాన్ని దేశానికి నష్టం కలిగేలా.. ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నా చేష్టలుడిగి చూస్తూండపోతున్నారు. కొన్ని రాష్ట్రాలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారు.. మరికొన్ని రాష్ట్రాలకు దివాలా తీసేలా అప్పులిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం.. విధానాల పరంగా.., పాలనా పరంగా ఎంత దివాలా తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల్ని రాచి రంపాన పెట్టిన బీజేపీ ప్రభుత్వం !

కాంగ్రెస్ హయాంలో గ్యాస్ సిలిండ్ర ఎంత నాలుగు వందలు.. ఇప్పుడు ఎంత.. పదకొండు వందలు. అంటే రెండు వందల శాతం పెరగింది. మరి బీజేపీ వచ్చినప్పుడు ఓ ఇరవై వేల జీతం ఉన్న ఉద్యోగికి..ఇప్పుడు అరవై వేల జీతం అయి ఉంటుందా ?. అలా అయ్యే చాన్సే లేదు పైగా.. అలాంటి వారి ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా అన్న వాతావరణం ఏర్పడింది. మోదీసర్కార్ తీసుకున్న రెండే రెండు నిర్ణయాలు లాక్ డౌన్, నోట్ల రద్దుతో దేశ ప్రజలు సగం చితికిపోయారు. ఈ రెండు నిర్ణయాలు దేశ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఎంతో మంది ఆర్థిక పునాదులు కదిలిపోయాయి. ప్రజలు మధ్యతరగతి నుంచి పేదలుగా మారారు. ఈ రెండు నిర్ణయాల తర్వాత ధరలు వేగంగా పెరిగాయి. ఫలితంగా ప్రజల ప్రమాణాలు దిగజారిపోయాయి. బీజేపీ పాలనా వైఫల్యాల్లో ఈ రెండు ప్రధానంగా కనిపిస్తాయి. ప్రధాని మోదీ రాత్రికి రాత్రే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రవాణా సదుపాయాలు లేక వేల మంది వలస కార్మికులు కాలినడక వేల కిలోమీటర్ల దూరం నడుచుకొంటూ స్వస్థలాలకు వెళ్లారు. మార్గ మధ్యలో ఆకలికి తాళలేక, ప్రమాదాల్లో వందల మంది చనిపోయారు. ‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అంటూ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా అయిన మోదీ దేశ నిరుద్యోగ యువతకు హామీనిచ్చారు. నిలబెట్టుకోలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే స్విస్‌ బ్యాంకులో ఉన్న మొత్తం నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని మోదీ 2014 ఎన్నికలప్రచారంలో ప్రగల్భాలు పలికారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామన్నారు. వాస్తవంలో మాత్రం బ్లాక్‌ మనీ వెనక్కు తీసుకురాకపోగా.. బీజేపీ పాలనలో స్విస్‌ బ్యాంకులో భారతీయుల బ్లాక్‌ మనీ పెరిగింది. నోట్లను రద్దు ద్వారా నకిలీ నోట్లను అరికడతామని, అవినీతి సొమ్ము బయటకు వస్తుందని మోదీ సర్కారు 2016లో చెప్పింది. కోట్లాది మంది పేదలను బ్యాంకుల ముందు లైన్లలో నిలబెట్టింది. కానీ నోట్ల రద్దు విధానం విఫలమైంది. అయినా ఇప్పుడు రెండు వేల నోట్ల ఉపసంహరమ చేపట్టారు.

వ్యవస్థలన్నీ దుర్వినియోగమే !

మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ముఖ్యమంత్రులందరితో కలిసి మనం టీమిండియా అన్నారు. కానీ టీము సభ్యుల్ని..తమ పార్టీ కాని వార్ని ఒక్కొక్కర్ని ఎలిమినేట్ చేస్తూ పోయారు. ఇందుకు దర్యాప్తు సంస్థల్ని నిర్మోహమాటంగా వాడుకున్నారు. ఇప్పటి వరకూ ఈడీ మొత్తం 121 కేసులు నమోదు చేయగా, వాటిలో 115 అంటే 95 శాతం విపక్ష నాయకులపైనే నమోదయ్యాయి. సీబీఐ 124 కేసులు నమోదు చేయగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపైనే 118 ఉన్నాయి. నేరారోపణలు రుజువైంది మాత్రం 0.5 శాతం కంటే తక్కువ కేసుల్లోనే. పీఎంఎల్‌ఏ తదితర సెక్షన్ల కింద తొమ్మిదేండ్లలో పెట్టిన కేసులు 5,422 కాగా, వీటిలో ప్రతిపక్ష నాయకులపై నమోదైనవి 5,150 ఉన్నాయంటే బీజేపీ హయాంలో దేశంలో పరిస్థితి ఎలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. పదేండ్ల యూపీఏ హయాంతో పోలిస్తే, 9 ఏండ్ల బీజేపీ హయాంలో విపక్షాలపై నమోదైన కేసులు 27 రెట్లు ఎక్కువ. మోదీ విధానాలను విమర్శించడంతో 149 మందిపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల లక్ష్యం ప్రభుత్వాలను మార్చడమే. చాలా వరకూ సాధించారు. ఇంకా సాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో డీఎంకే మంత్రుల లక్ష్యంగా సాగుతున్న ఐటీ దాడులే సాక్ష్యం. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో సాధించింది ఎంతో కానీ.. ప్రపంచంలో మనదే అగ్రరాజ్యం అన్న ప్రచారం చేసుకోవడంలో మాత్రం ముందున్నారు.కానీ పదేళ్ల కిందట దేశ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ఇప్పుడూ ఎదుర్కొంటున్నారు. పేదరికం తగ్గలేదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. కానీ ప్రజల మధ్య ఓ చీలిక తీసుకు రావడంలో మాత్రం మంచి పురోగతి సాధించారు. ఆ దుష్ప్రభావం దేశంపై కనిపిస్తోంది.

బంగారు తెలంగాణ చేసేశామంటున్న కేసీఆర్ !

కేసీఆర్ పాలన తొమ్మిదేళ్లు పూర్తవుతోంది. రెండో సారి గెలిచినా ఆయన గతంలో ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లడంతో పదో ఏడు రాకుండానే ఆయన ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఎన్నికల కోసం ఆయన ఈ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో సాధించిన విజయాలను వందల కోట్ల ప్రజాధానం పెట్టి చేస్తున్నారు. పదో ఏడాది పూర్తయిన తర్వాత చేయాల్సిన దశాబ్ది ఉత్సవాలు పదో ఏట ప్రారంభం కాగానే చేస్తున్నారు. దీనికి కారణం ఎన్నికలని ప్రత్యేకంగా చెప్పాల్సి న పని లేదు. కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రచారం మొదటి నుంచి తేడాగా ఉంటుంది. తెలంగాణ రాక ముందు తెలంగాణ ప్రజలు అసలు తిండి, నీళ్లు లేకుండా ఉండేవారన్నట్లుగా.. ఇప్పుడు వారు తినే ప్రతి గింజ..తాగే ప్రతి చుక్క తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం వల్లనే వచ్చిందని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కు ఇప్పుడు తిరుగులేని విధంగా మీడియా బలం ఉంది. సోషల్ మీడియా బలం ఉంది. అంతకు మించిన ఆర్థిక శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అందుకే ఆయన తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్ని మార్చేశానని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు హైదరాబాద్ కళ్లద్దాల నుంచి చూస్తే బాగానే ఉంటాయి. కానీ ఇతర జిల్లాల్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్తే.. బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలపై కథలు కథలుగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే సీఎం కేసీఆర్ కు ఇలాంటి బాధలను భావోద్వేగంలో దాచి పెట్టేసి ఓట్లు పొందడం బాగా తెలుసు. అందుకే ఆయన 21 రోజుల సంబరాలను హోరెత్తిస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రయోజనాల పట్ల కేసీఆర్ కు అంకిత భావం ఉందన్న అభిప్రాయం ఉండేది కానీ.. ఇటీవల ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల విషయంలో ప్రభుత్వ తీరు వివాదాస్పదమవుతోంది. ధరణి అనే విధానాన్ని తీసుకు రావడం వెనుక పెద్ద స్కాం ఉందన్న ఆరోపణలు ఊరకనేరావడం లేదు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి బడా రియల్ ఎస్టేట్ సంస్థ కేసీఆర్ లేదా కేటీఆర్ బినామీలేనని.. ప్రచారం జరగడం వెనుక భూదందా ఉందిన్న విమర్శలు వస్తున్నాయి. కోర్టుకేసుల్లో ఉన్న భూమలను పోరాడకుండా వదిలేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు దేశంలో అత్యంత ధనిక పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్,. సొంత విమానంతో పాటు జాతీయ రాజకీయాలు చేయడానికి కావాల్సినంత సొమ్ము ఉందని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. ఇదందా ఎలా వచ్చిందన్న సందేహం చాలా మందిలో ఉంది. కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడరని ప్రజలు గట్టిగా నమ్ముతారు. కానీ ఇటీవలి కాలంలో.. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ నమ్మకం సడలిపోతోంది.

అదే సమయంలో కేసీఆర్ చేస్తున్న కుటిల రాజకీయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. తాను లేదా తన పార్టీ మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధించాలన్న లక్ష్యంతో ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చినప్పటికీ ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేందుకు ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇది బీఆర్ఎస్‌లో అసంతృప్తికి కారణం అవడంతో పాటు ప్రజల్లోనూ వ్యతిరేక భావన పెంచింది. కానీ కేసఆర్ నేతృత్వంలో సాగుతున్న ప్రచారం మాత్రం.. ప్రస్తుత తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయిందనే. ఈ ప్రచారం సామాన్యులకు.. బాధలతో అల్లాడేవారికి.. ప్రభుత్వ నిర్వాకాల కారణంగా నష్టపోయిన వారికి పుండు మీద కారం చల్లినట్లు చేయడమే. కానీ ఈ ప్రచారాన్నే ప్రభుత్వం నమ్ముకుంటోంది.

98.4 శాతం హామీల దగ్గర వైసీపీ ప్రచారం !

కేంద్రానికి, తెలంగాణకు తొమ్మిదేళ్ల పాలన పూర్తయింది కానీ..ఏపీలో జగన్ కు మాత్రం నాలుగేళ్లే. ఆ రెండింటికంటే భిన్నంగా జగన్ ప్రచార సరళి ఉంటుంది. ఆయన తన హామీల ను 98.4 శాతం అమలు చేశానని ప్రచారం చేసుకునే దగ్గరే ఉన్నారు. బటన్లు నొక్కి ప్రజల్ని ఉద్దరిస్తున్నానని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. అదే ప్రచారం చేసుకుంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత వ్యవహారశైలి.. హత్య ఆరోపణలు, అవినీతి కేసులు, తనకు ఏదైనా కష్టం జరిగితే.. అది తన ప్రత్యర్థులైన చంద్రబాబు, పవన్ కు జరిగి తీరాలన్న ఓ విచిత్రమైన పగతో వ్యవస్థల్ని వేటాడటం వంటి చర్యల ద్వారా ఆయన నొక్కే మీటల కన్నా.. చేసే బిత్తిరి పనుల వల్ల ఎక్కువ ప్రచారంలోకి వస్తున్నారు. వివేకా హత్య కేసులో పూర్తిగా తప్పటడుగులు వేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తన పాత్ర కూడా బయటకు వస్తుందేమోననే భయంతో ఆయనను కాపాడటానికి తన సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఇవనే ప్రచారంలోకి వస్తున్నాయి. తన నాలుగేళ్ల పాలన పూర్తయిన సమయంలో తన విజాయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సంత పార్టీ క్యాడర్ కూడా ఆసక్తి చూపించకపోవడం.. ఆయన పాలనా తీరుకు నిదర్శనం. అయితే ప్రజల్ని మభ్య పెట్టడానికి భిన్నమైన ప్రచార మార్గాలను ఎన్నుకుంటున్నారు. పేదలు , పెత్తందారుల అంటూ ఫ్లెక్సీలేస్తున్నారు. ఆయన వ్యూహాలు ఎంత వరకూ సక్సెస్ అవుతాయో కానీ.. అందరూ ఆయన వైపు అదో రకంగా చూస్తున్నారు.

ప్రభుత్వాలు .. ప్రజల మేలు చేయాలి. అధికారంలో ఉన్న వారి పాలన చూసి.. వారి పాలన వల్ల తమకేమైనా మేలు జరిగిందా లేదా అన్నది బేరీజు వేసుకుని ఓటర్లు ఓట్లు వేస్తారు. మీకు మంచి చేశామని ఇంటికెళ్లి చెబితే.. ఓహో నిజమే అని నమ్మేసి వేయరు. ప్రభుత్వంలో ఉన్న వారికి పాలనే ప్రచారం. దాన్ని మర్చిపోయి.. ప్రజాధనాన్ని వందల కోట్లు వెచ్చించి… భావోద్వేగాల మాయలో ప్రజల్ని పడేసి ఓట్లు సంపాదించుకుందామనే ఓ రకమైన కుత్సిత రాజకీయాలకు పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close