లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన కొద్ది గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నిన్నటి పరిణామాల తర్వాత ప్రభుత్వం రక్షణత్మక ధోరణిలో కాకుండా, మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
రాజ్యాంగసవరణ బిల్లు వీగిపోవడం అరుదు
లోక్సభలో 12 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వ బిల్లు, అది కూడా రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం సాధారణ విషయం కాదు. అయితే, దీనిని ఒక వైఫల్యంగా కాకుండా, రాజకీయ అస్త్రంగా మార్చుకోవడమే మోదీ-షా ద్వయం లక్ష్యమని స్పష్టమవుతోంది. అందుకే అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. కేబినెట్ భేటీలో ప్రధానంగా విపక్షాల అడ్డంకి ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపైనే చర్చ జరగనున్నట్లు సమాచారం. బిల్లు వీగిపోయినందున ప్రభుత్వం తదుపరి అడుగులు ఎలా ఉండాలి? పార్లమెంటు వేదికగా కాకుండా ఇతర మార్గాల్లో ఈ ఎజెండాను ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రులతో ప్రధాని చర్చిస్తున్నారు.
ప్రజా క్షేత్రంలోకి సవరణ పోరు
కేబినెట్ భేటీలో తీసుకోబోయే ప్రధాన నిర్ణయం.. ఈ బిల్లు వైఫల్యానికి విపక్షాలే బాధ్యులని పేర్కొంటూ దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టడం. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో మరో వారం పోలింగ్ జరగనున్నందున..ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, మహిళా రిజర్వేషన్లను విపక్షాలు ఎలా అడ్డుకున్నాయనే దానిపై ఒక చార్జ్ షీట్ సిద్ధం చేసే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత మంత్రులందరూ తమ తమ రాష్ట్రాల్లో పర్యటించి, ఈ అంశంపై మీడియా సమావేశాలు నిర్వహించాలని ప్రధాని ఆదేశించే అవకాశం ఉంది.
వ్యూహాత్మక వెనకడుగు.. వేగవంతమైన ముందడుగు
ఓటమితో ప్రభుత్వం డీలా పడకుండా, సభలో చర్చకు రాకుండానే ఉపసంహరించుకున్న మిగిలిన రెండు బిల్లుల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను కేబినెట్ అన్వేషిస్తోంది. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలా లేక వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మరింత పకడ్బందీగా ముందుకు రావాలా? అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలను కేబినెట్ పరిగణనలోకి తీసుకుంటోంది. యాభై శాతం ఫార్ములాను బిల్లులో పెడితే మద్దతిస్తామని అఖిలేష్ చెప్పినందున ఆ ఫార్ములాపైనా పరిశీలన చేయగలరు.
