టీడీపీ ఎంపీలు ఖబడ్దార్ అన్నారట..! హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన జీవీఎల్..!!

భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. తెలుగుదేశం పార్టీ ఎంపీలపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. దీనికి కారణం ఆయనను టీడీపీ ఎంపీలు బెదిరించడమట. ఖబడ్దార్ అని తనను హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలను…రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చినట్లుగా జీవీఎల్ ప్రకటించారు. టీడీపీ ఎంపీలపై చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం.. రాజ్యసభలో… విభజన హామీలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఆ సమయంలో బీజేపీ తరపున మొదట జీవీఎల్ మాట్లాడారు. బయట ప్రెస్‌మీట్లలో ఏం చెబుతారో.. జీవీఎల్ అదే విషయాన్ని రాజ్యసభలో మరోసారి చెప్పారు. జీవీఎల్ ప్రసంగిస్తున్నప్పుడే.. టీడీపీ నేతలు అబద్దాలు చెబుతున్నారని నినాదాలు చేశారు. ఆ తర్వాత లోపల ఏం జరిగిందో బయటకు రాలేదు.

ఇప్పుడు హఠాత్తుగా జీవీఎల్ టీడీపీ ఎంపీలు తనను బెదిరించారని ఆరోపిస్తూ..సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చారు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా ఆయన రాజ్యసభ చైర్మన్ కు ఇచ్చినట్లు చెబుతున్నారు. మామూలుగా అయితే రాజ్యసభ సెక్రటేరియట్ దృశ్యాలను ఎవరికీ ఇవ్వదు. టీవీల్లో ప్రసారమైన వాటిలో టీడీపీ నేతలు ఖబడ్దార్ అని హెచ్చరిస్తే… అప్పుడే వివాదం అయి ఉండేది. మరి రాజ్యసభ సెక్రటేరియట్ కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని జీవీఎల్ దృశ్యాలు తీసుకుని ఉంటారు. తాను నిజాలు వెల్లడించినందునే.. టీడీపీ ఎంపీలు తనను బెదిరించారని..జీవీఎల్ చెప్పుకొస్తున్నారు.

తెలుగు దేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి.. జీవీఎల్ నరసింహారావు.. ఏపీ వ్యవహారాలను బీజేపీ తరపున దత్తత తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి తన శక్తియుక్తులను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ చేసే ఆరోపణలకు ఎప్పటికప్పుడు రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. టీవీ చర్చలకు కూడా ధైర్యంగా వస్తున్నారు కానీ… టీడీపీ నేతలు లేవనెత్తే అంశాలకు సమాధానాలు చెప్పకుండా వెళ్లిపోతారన్న ఇమేజ్‌ను మూటగట్టుకున్నారు. ఇప్పుడు విమర్శలు, ప్రతివిమర్శల స్థానంలో కొత్తగా.. ప్రివిలేజ్ మోషన్లు ఇచ్చి టీడీపీ ఎంపీలపై తన పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.