అరణ్యమున ‘హరీంద్ర గర్జన’… తారస్థాయిలో ‘తారక రామ’ భజన …

రవి తెలకపల్లి

అరణ్యమున హరీంద్ర గర్జన అన్న శ్రీశ్రీ కవితాచరణం ఇప్పుడు మంత్రి హరీష్‌ రావుకు బాగా సరిపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాలనే గాక దేశాన్ని కూడా ఆకర్షిస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల రంగంలో అయన ఒక ముఖ్య పాత్రధారిగా కనిపించే అవకాశం ఇంతవరకూ లేకుండా పోయింది. కర్త కర్మ క్రియ అన్నీ కెటిఆర్‌ అన్నట్టు కథ నడుస్తున్నది. ఈ ఊపులో కెటిఆర్‌ మరీ దూకుడుగా మాట్లాడి మళ్లీ సవరించుకోవలసి వస్తున్నది కూడా. టిఆర్‌ఎస్‌ను తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామని చెప్పడం అందులో ఒకటి మాత్రమే. ఆ మాట జోక్‌గా అన్నానని తర్వాత సర్దుకున్నారు.

బాగానే ఉంది అనుకునేలోపలే బిజెపిని భారతీయ జోక్‌ పార్టీ అని అభివర్ణించారు. జోకు వేసింది మీరైతే మా పార్టీని జోక్‌ పార్టీ అంటారెందుకు? అని బిజెపి నేతలు నిలదీస్తున్నారు. పైగా ఈ ఎన్నికల్లో తమ తర్వాతి స్థానం, తమ ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అని కెటిఆర్‌ చెబుతున్నారు. జోక్‌ పార్టీ ఎలాటి ప్రధాన ప్రత్యర్థి అవుతుందనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తమ జెండా ఎగరేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు చేయడం కూడా చాలా చర్చకు దారి తీసింది. వంద స్థానాలు వస్తాయని కూడా ఆయనే చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ 100 స్థానాల్లో గెలుపు పతాకశీర్షిక ఇచ్చి, రాజీనామా సవాలును కింద హైలెట్స్‌లో కూడా ఇవ్వకపోవడం విశేషం. టిఆర్‌ఎస్‌కు ఎంత ఘన విజయం వచ్చిందనుకున్నా 100 చేరుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పొచ్చు.

టిఆర్‌ఎస్‌లోనూ… ప్రభుత్వంలోనూ..కీలక పాత్రధారిగా వున్న మంత్రి హరీష్‌ రావుకు ఇంతవరకూ జిహెచ్‌ఎంసి ఎన్నికలపై ప్రధాన ప్రకటన కాని వ్యాఖ్యలు గానీ చేసే అవకాశమే ఇవ్వకపోవడం ఆ శిబిరంలో అసంతృప్తి, ఆగ్రహం కలిగిస్తున్నది. కెటిఆర్‌ను ముందుకు తేవడానికి ఈ అవకాశం ఉపయోగించుకోవాలన్న వ్యూహమే ఇందుకు కారణం అని వారు భావిస్తున్నారు. ఈ లోటు తీర్చుకోవడం కోసం హరీష్‌ తన శాఖకు చెందిన పర్యటనలు, సమావేశాలు నిర్వహిస్తున్నా వాటికి ఎన్నికలతో సమానమైన ప్రాధాన్యత లభించదు. ఎట్టకేలకు ఈ వారం ఆయనకు సికిందరాబాదులోని మెట్టుగూడ డివిజన్‌ బాధ్యత అప్పగించినట్టు ప్రకటించారు. ఈ వార్తను కూడా అ(న)ధికార పత్రిక లోపలి పేజీలో చిన్నదిగా ఇచ్చింది!

తమకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే ఆ విషయం అందరికీ అర్థమయ్యేట్టు చేయడం సరైంది కాదని హరీష్‌ అనుయాయులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం ప్రశ్నించినప్పుడు ‘హరీష్‌తో పంచాయితీ పెట్టుకునే సమయం లేదు’ అని కెటిఆర్‌ అన్నట్టు ఒక పత్రికలో వచ్చిన శీర్షిక కూడా గౌరవంగా లేదని వారు విమర్శిస్తున్నారు. తన పని తాను చేసుకుపోతున్న హరీష్‌కు కూడా పంచాయతీ ఎందుకు అని వారు వాదిస్తున్నారు. తామిద్దరం కెసిఆర్‌ నాయకత్వంలో బాధ్యతల నిర్వహణకు శ్రమిస్తున్నామని అనడం తప్ప అంతకు మించి ఆదరపూర్వకమైన ప్రస్తావన చేయకపోవడం, పంచాయితీకి సమయం లేదనడం మంచి సంకేతం కాదని హరీష్‌ అనుచరుడైన ఒక ముఖ్య నేత అన్నారు.

నారాయణఖేడ్‌ ఉప ఎన్నిక బాధ్యత హరీష్‌కు అప్పగించినట్టు టిఆర్‌ఎస్‌ గతంలోనే ప్రకటించింది. ఆ ఎన్నిక ఫిబ్రవరి 13న జరుగుతుందని ప్రకటించిన దృష్ట్యా ఆయన అటు దృష్టి పెట్టినట్టు చెప్పుకునే అవకాశం వుంది. ఏదైనా సంక్షోభ పరిస్థితి లేదా సంకట పరిస్థితి వస్తే హరీష్‌ రావుతో మాట్లాడించడం కెసిఆర్‌ చాలా సార్లు చేశారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల సమరం మరింత ఉధృతమైనాక ఆ పని జరగవచ్చు గాని ఇప్పటికే కెటిఆర్‌ను రాజధాని నగర సారథిగా ప్రదర్శించిన ముఖ్యమంత్రి రాజకీయ వారసత్వ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టేనన్న అభిప్రాయం అందరిలో నెలకొన్నది. ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా కోఆప్షన్‌తోనైనా టిఆర్‌ఎస్‌ మేయర్‌ స్థానం పొందితే కెటిఆర్‌కు ఆ ఘనత దక్కుతుంది. ఒకవేళ తక్కువ స్థానాలు వచ్చినా గతసారి పోటీ చేయనేలేదని, మొన్నటి ఎన్నికల్లో రెండు స్థానాలు మాత్రమే వచ్చాయని సమర్థించుకునే అవకాశం వుంది. వంద స్థానాలు వస్తాయన్న దానికి గాక, తమ జెండా ఎగరకపోతే రాజీనామా చేస్తానని మాత్రమే ఆయన సవాలు సారాంశమని ఆ పార్టీ ప్రతినిధులు ఇప్పటికే వివరణలు ఇస్తున్నారు. మొత్తంపైన అటు హరీష్‌ను పక్కనపెట్టడం ద్వారానూ ఇటు మరీ దూకుడుగా మాట్లాడ్డంలోనూ కెటిఆర్‌ సంయమనం ప్రదర్శించాల్సిన అవసరం కనిపిస్తుంది.

2014 లో 22 శాతం ఓట్లు వచ్చాయి గనుక అది ఇప్పుడు 35 శాతం వరకూ పెరుగుతుందని ఆయన ఇచ్చే వివరణ. ప్రచారం ప్రారంభంలో తమకు 80 స్థానాల వరకూ వస్తాయనే వారు. ఈ పదిహేను రోజుల్లో ఈ సంఖ్య వందకు పెరిగేంతగా పరిస్తితి మారిందనడం అతిశయోక్తి మాత్రమే. తెలుగుదేశం లెక్కలోనే వుండదనీ, కాంగ్రెస్‌ రెండంకెలకు చేరుకోలేదని ఆయన తీసిపారేయడం కూడా అవాస్తవికం అనిపిస్తుంది. టిఆర్‌ఎస్‌ కు నిజంగా అంత నమ్మకమే ఉంటే, హైదరాబాదు ఆ పరిసరాలకు సంబంధించి ఫిరాయించి వచ్చిన తెలుగుదేశం ఎంఎల్‌ఎలతో రాజీనామా చేయించి, ఉప ఎన్నికలలో తలపడివుండేది. జంటనగరాలలో పౌరసమస్యలు అనేకం ఉండగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పొరబాట్లు..అశ్రద్ద కూడా అగుపిస్తుండగా ఏకపక్షంగా తామే గెలిచిపోతామని ఆయన పదే పదే చెప్పడం తమ వారిని ఉత్సాహపర్చడానికి మాత్రమే పనికి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close