దేశవ్యాప్తంగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం ఒక శుభవార్త అందించింది. ఇప్పటివరకు కేవలం బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల ఆధారంగానే సిబిల్ వంటి క్రెడిట్ స్కోర్లు లెక్కిస్తున్నారు. ఇకపై ప్రతి నెలా డిజిటల్ పద్ధతిలో చెల్లించే ఇంటి అద్దెను కూడా క్రెడిట్ హిస్టరీలో భాగంగా పరిగణించాలనే ప్రతిపాదన కార్యరూపం దాలుస్తోంది. దీనివల్ల క్రమం తప్పకుండా అద్దె చెల్లించే వ్యక్తుల క్రెడిట్ ప్రొఫైల్ మరింత బలోపేతం కానుంది.
ఈ నూతన విధానం అమలులోకి వస్తే, ముఖ్యంగా వ్యవస్థీకృత రంగంలో పని చేయని వారికి ,తొలిసారి హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి గొప్ప లబ్ధి చేకూరుతుంది. సాధారణంగా సొంత ఇల్లు లేని వారు తమ ఆదాయంలో పెద్ద మొత్తాన్ని అద్దె రూపంలో చెల్లిస్తుంటారు. ఈ చెల్లింపులను క్రెడిట్ స్కోరులో చేర్చడం ద్వారా, సదరు వ్యక్తికి ఉన్న ఆర్థిక క్రమశిక్షణ స్పష్టంగా అర్థమవుతుంది. యూపీఐ , నెట్ బ్యాంకింగ్ లేదా వాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలను ప్రామాణికంగా తీసుకుని, రుణ గ్రహీత విశ్వసనీయతను బ్యాంకులు అంచనా వేస్తాయి.
ఈ మార్పు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే గృహ రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అద్దె కట్టే ప్రతి రూపాయి, రేపు మీ సొంత ఇంటి కలని సాకారం చేసే పెట్టుబడిగా మారుతుంది అన్నదే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు, సామాన్యులకు రుణ లభ్యతను సులభతరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది.