ట్రంప్, ఇరాన్ .. ఎవరి హెచ్చరికలు వారు జారీ చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. దానికి ఇరాన్ కౌంటర్ ఇచ్చారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా ఏ రకమైన దాడికి పాల్పడినా ఊరుకోబోమని, అది అమెరికాకు చివరి హెచ్చరిక అని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ తమ దేశంపై దాడులు జరిగితే, దానికి ప్రతిగా అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలపై కూడా తీవ్రస్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఇరాన్ మిలిటరీ వర్గాలు హెచ్చరించాయి.
ముఖ్యంగా ఇంధన ,మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే.. ఆయిల్ రిఫైనరీలు, ఎల్పీజీ , ఎల్ఎల్జీ కేంద్రాలతో పాటు అత్యంత కీలకమైన ఐటీ నెట్వర్క్ , నీటి శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ దాడులు కేవలం అమెరికా స్థావరాలకే పరిమితం కాకుండా, ఆ ప్రాంతంలో అమెరికాకు మద్దతు ఇచ్చే దేశాల ఆర్థిక మూలాలపై కూడా ఉంటాయని ఇరాన్ ఘాటుగా స్పందించింది.
అంతర్జాతీయ ఇంధన సరఫరాలో కీలకమైన హర్మజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ బెదిరిపంులతో ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతుండగా, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గకుండా దెబ్బకు దెబ్బ అనే రీతిలో సిద్ధమవుతోంది. ఈ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం క్షేత్రస్థాయిలో భౌతిక దాడులకు దారితీస్తే అది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసేంత ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
