నేటి నుంచి పార్లమెంట్ యుద్ధం..! మోడీని టీడీపీ ఇరుకున పెట్టగలుగుతుందా..?

విభజన హామీల సాధన కోసం తెలుగుదేశం పార్టీ.. మరో సారి పార్లమెంట్ వేదికగా పోరాటం చేయబోతోంది. తొలి రోజు నుంచే… కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే.. మొదటి రోజే అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుపట్టాలని నిర్ణయించింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు.. ఈ మేరకు.. నిన్ననే నోటీసు ఇచ్చారు. సభ ఆర్డర్‌లో ఉంటే.. అవిశ్వాస తీర్మానం విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటో ఇంకా బయటకు రాలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండో విడత.. పూర్తిగా… అవిశ్వాస తీర్మానం అంశంతోనే వాయిదా పడ్డాయి.

అప్పట్లో కొన్ని రోజులు.. టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభను అడ్డుకున్నాయి. కొన్ని రోజులు… అన్నాడీఏంకే మాత్రమే అడ్డుకుంది. వారిని సస్పెండ్ చేసి.. అవిశ్వాసంపై చర్చించే అవకాశం ఉన్నా .. కేంద్రం ధైర్యం చేయలేదు. అప్పట్లో కర్ణాటక ఎన్నికలు ఉండటం.. అన్నాడీఎంకే డిమాండ్.. కావేరీ బోర్డు ఏర్పాటు చేయడం కావడంతో… కేంద్రం వాయిదాకే మొగ్గు చూపింది. ఇప్పుడు కావేరీ బోర్డును కేంద్రం ఏర్పాటు చేసింది. ఆందోళన చేయడానికి… ఇతర పార్టీలకు పెద్ద కారణాలేమీ లేవు. తెలుగుదేశం పార్టీ.. ఎంపీలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ కలిశారు. ఆయా పార్టీల నేతలకు… పార్లమెంట్‌లో తమ పోరాటానికి మద్దతివ్వాలంటూ.. చంద్రబాబు రాసిన లేఖలు అందించారు. గత సమావేశాల్లో మద్దతు తెలిపిన పార్టీలన్నీ ఈ సారి కూడా టీడీపీ పోరాటానికి మద్దతు తెలిపాయి.

అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే.. తెలంగాణ అంశాలపై మాట్లాడతామని టీఆర్ఎస్ ప్రకటించింది. ఓటింగ్ విషయంలో నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకుంటారని.. ఆ పార్టీ ఎంపీలు చెబుతున్నారు. అయితే.. అవిశ్వాస తీర్మానం లక్ష్యం ఓటింగ్ కాదని.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకు వచ్చి.. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనేదేనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తొలి రోజు నుంచి పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల పోరాటమే సెంటరాఫ్ ఎట్రాక్షన్ కానుంది. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎప్పట్లానే.. వేషాలు వేయనున్నారు.

ఈ విషయంలో బీజేపీ ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందోన్న విషయం ఇంకా బయటకు రాలేదు. అవిశ్వాస తీర్మానంపై చర్చించకపోతే విమర్శలు వస్తాయి. రహస్య మిత్రులతో ఆందోళనలు చేయించి..సభను వాయిదా వేసుకున్నా బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులే ఎదురవుతాయి. పోలవరం విషయంలో ఒడిషా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది కాబట్టి.. ఆ పార్టీ ఎంపీలతో ఆందోళన చేయిస్తే.. టిట్ ఫర్ టాట్ అన్నట్లు ఉంటుందని బీజేపీ ఆలోచించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఏం చేస్తుందన్నది సభలోనే తేలనుంది. ఈ సమావేశాల్లో లోక్‌సభలో వైసీపీ ఎంపీల ఉనికి లేదు. రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు ఉన్నా.. సభలోపల నిరసన తెలియజేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com