వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ ను ఉద్దేశించి జగన్ శపథం చేశారు. తాను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్కేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తానని జగన్ హెచ్చరించారు.
ఆర్కే తన ‘వీకెండ్ కామెంట్’లో వాడిన ఒక వాక్యాన్ని పట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారు. ఒకవేళ ఆ వాక్యం ఆయన పరువు తీసేలా ఉంటే జగన్ ఇప్పుడే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చని, కోర్టును ఆశ్రయించవచ్చు. ఐదేళ్ల పాలనలో దేశద్రోహం వంటి కేసులు పెట్టినా ఆర్కేను ఏమీ చేయలేకపోయిన జగన్, ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఏదో చేస్తానని చెప్పడం వింతే. మహిళలను, రాజకీయ ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించే సంస్కృతికి జగన్ ఆద్యుడు. చివరికి తన సొంత తల్లి, చెల్లి సైతం సోషల్ మీడియా వేధింపులకు గురయ్యామని స్వయంగా వెల్లడించడం జగన్ నైతికతను ప్రశ్నిస్తోంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు గౌరవం గురించి, చట్టం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంటుంది.
తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ నిర్వహించే ప్రెస్ మీట్లు, కార్యకర్తల సమావేశాల్లో స్క్రిప్టు మారడంలేదు. తాడేపల్లి గూడెం నుంచి వచ్చిన కార్యకర్తలతో సమావేశమైన జగన్, క్షేత్రస్థాయి సమస్యలను పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత ద్వేషం, ప్రతీకారేచ్ఛతో కూడిన ప్రసంగాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం మానేసి, మీడియా సంస్థల అధిపతులను లక్ష్యంగా చేసుకోవడం జగన్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా కనిపిస్తోంది.
ఎలాంటి లాభం ఉండకపోయినా ఇప్పటికీ మావిగన్ గురించి మాట్లాడుతున్నారు. అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని అప్పుడు రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తానని అంటున్నారు. ఆయన తీరు చూసి కార్యకర్తలు కూడా నిరాశకు గురవుతున్నారు.
