అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక మహిళ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ దుమారం సృష్టిస్తున్నాయి. బాధితురాలు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేసిన వీడియోలో తనపై ఏడాదిన్నర కాలంగా సాగుతున్న అకృత్యాలను కన్నీటి పర్యంతమై వివరించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఎమ్మెల్యే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లోబర్చుకున్నారని, ఈ క్రమంలో తాను ఐదుసార్లు గర్భవతిని కాగా బలవంతంగా అబార్షన్లు చేయించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై జనసేన అధిష్టానం అత్యంత సీరియస్‌గా స్పందించింది. పార్టీ క్రమశిక్షణ, నైతిక విలువల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఒక అంతర్గత కమిటీని నియమించింది. బాధితురాలు బయటపెట్టిన వీడియోలు, వాట్సాప్ చాట్లు , ఇతర ఆధారాలను ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు, ఈ ఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలితో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను ఖండించారు, తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా దీనిని అభివర్ణించారు. జనసేన విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసులో తదుపరి పరిణామాలు ఉండనున్నాయి.
