2014 మార్చి 14న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా కాంగ్రెస్ హఠావో – దేశ్ బచావో అనే నినాదంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కేవలం అధికారం కోసం కాకుండా, సమాజంలో మార్పు కోసం, ప్రశ్నించే గొంతుకగా ఈ పార్టీ ఉద్భవించింది. ఆనాడు పార్టీకి ఎటువంటి కేడర్ లేకపోయినా, తనను నమ్మిన అభిమానులనే సైనికులుగా మార్చుకుని ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోటీకి దూరంగా ఉండి పొత్తులకు మద్దతునిచ్చిన పవన్ కళ్యాణ్, 2019లో ఎదురుదెబ్బలు తగిలినా వెనక్కి తగ్గకుండా పదేళ్ల పాటు ఓర్పుతో, నిలకడతో పార్టీని నిర్మించిన తీరు నేటి రాజకీయాల్లో ఒక అద్భుతం.
జనసేన ఏడు సిద్ధాంతాలు – ఒక కొత్త దిశ
జనసేన పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ సంస్థ మాత్రమే కాదు, అది ఒక స్పష్టమైన భావజాలం. పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఏడు సిద్ధాంతాలు పార్టీకి దిక్సూచిగా నిలుస్తున్నాయి. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల మధ్య వైషమ్యం లేని రాజకీయం, భాషా వైవిధ్యాన్ని గౌరవించే సంప్రదాయం, మన సంస్కృతిని కాపాడే సమాజం, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం , పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి – ఇవే జనసేన పునాదులు. మనుషులంతా ఒక్కటే అనే మానవతావాదమే తన సిద్ధాంతమని ఆయన గట్టిగా నమ్ముతారు.
పవన్ రాజకీయ పయనం – నిలకడకు నిదర్శనం
రాజకీయాల్లోకి రావడం సులభం కానీ, దశాబ్ద కాలం పాటు నిలబడటం చాలా కష్టం. ఒకప్పుడు కేవలం ఒక సినీ నటుడిగా చూసిన వారే, నేడు పవన్ కళ్యాణ్‌ను ఒక పరిణతి చెందిన రాజకీయ నేతగా గౌరవిస్తున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, వ్యక్తిగత విమర్శలు వచ్చినా ఆయన తన పంథాను మార్చుకోలేదు. ముఖ్యంగా 2024 ఎన్నికల్లో ఆయన చూపిన వ్యూహచతురత, ఓట్లు చీలకుండా కూటమిని ఏర్పాటు చేయడంలో ఆయన వహించిన పాత్ర అసాధారణం. తన పార్టీకి లభించిన 21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి, జనసేన సత్తాను దేశవ్యాప్తంగా చాటిచెప్పారు.
గిరిజన గడ్డపై 13వ వసంతం – అట్టడుగు వర్గాల చెంతకు
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలను ఈసారి ఆడంబరాలకు దూరంగా, గిరిజన ప్రాంతమైన పాడేరులోని నందిగరువు గ్రామంలో జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడం ఆయన నవతరం రాజకీయానికి అద్దం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా బహిరంగ సభలను రద్దు చేసి, నేరుగా అడవి బిడ్డల చెంతకు వెళ్లి వారి సమస్యలను వినడం, వారితో కలిసి సహపంక్తి భోజనం చేయడం వంటి చర్యలు పార్టీ మూల సిద్ధాంతాలను ప్రతిబింబిస్తున్నాయి. అధికారం వచ్చినా గర్వపడకుండా, సామాన్యులకు , చేరువవ్వాలనే తపన జనసైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
