అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న హనీట్రాప్ ముఠా బాగోతం ఇప్పుడు పోలీసు శాఖలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అందమైన యువతులను ఎరగా వేసి, సంపన్న వర్గాలను వలలో వేసుకుని నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఈ ముఠా వెనుక సాక్షాత్తూ పోలీసు అధికారులే సూత్రధారులుగా వ్యవహరించారనే వార్తలు షాక్‌కు గురిచేస్తున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన వారే నేరగాళ్లకు అండగా నిలిచి, బాధితులను భయపెట్టి లక్షలాది రూపాయలు వసూలు చేయడంలో సహకరించారు.
వలపు వల.. ఖాకీల కనుసన్నల్లోనే!
ఈ హనీట్రాప్ గ్యాంగ్ మొదట ధనవంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్టర్లను టార్గెట్ చేస్తుంది. యువతులతో ఫోన్ కాల్స్ చేయించి, పరిచయం పెంచుకుని ఏకాంతంగా కలవాలని ఆహ్వానిస్తారు. బాధితులు ఆ వలలో పడగానే, పక్కా ప్లాన్ ప్రకారం న్యూడ్ వీడియోలు తీసి, ఆ వెంటనే ముఠాలోని ఇతర సభ్యులు భర్త లేదా అన్న పేరుతో ఎంట్రీ ఇచ్చి దాడి చేస్తారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముగ్గురు సీఐల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. గ్యాంగ్ సభ్యుల మధ్య విభేదాలు వస్తే ఒక సీఐ స్వయంగా రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేశారనే ఆడియో టేపులు లీక్ అయ్యాయి.
బంగారు బాతు – ఆడియో లీక్‌తో గుట్టురట్టు
ముఖ్యంగా ఈ కేసులో ఓ కానిస్టేబుల్ పాత్రపై వస్తున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. బాధితుడిని బంగారు బాతు గా అభివర్ణిస్తూ, అతని నుంచి ఎంత వీలైతే అంత గుంజాలని ముఠా సభ్యురాలితో సదరు కానిస్టేబుల్ బేరసారాలు సాగించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులే, వాడు తెలివైనోడు.. జాగ్రత్తగా డీల్ చేయండి ” అంటూ చిట్కాలు ఇవ్వడం పోలీసు వ్యవస్థకే తలవంపులు తెచ్చింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై సీరియస్ అయిన అనంతపురం ఎస్పీ జగదీష్, ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపిస్తూ కఠిన చర్యలు చేపట్టారు.
బాధితుల గోడు.. బట్టబయలైన బాగోతం
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో ఈ చీకటి సామ్రాజ్యం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ. 4.5 లక్షలు సమర్పించుకున్న ఆయన, మళ్లీ రూ. 10 లక్షల కోసం వేధింపులు భరించలేక ఎస్పీని ఆశ్రయించడంతో ఈ దందా బట్టబయలైంది. జిల్లాలో ఇప్పటివరకు పది మందికి పైగా ఈ ముఠా బారినపడి రూ. 10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. పరువు పోతుందనే భయంతో మరికొందరు బాధితులు నోరు విప్పడం లేదు. ఈ కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని ఎస్పీ హెచ్చరించడంతో, రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
