ఏఐ కారణంగా లే ఆఫ్స్ భయంతో ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనడం మానేస్తున్నారు. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా క్యూ1-2026 నివేదిక ప్రకారం, భారత రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఆందోళనకరమైన మార్పు కనిపిస్తోంది. గత ఐదేళ్లుగా అప్రతిహతంగా సాగుతున్న గృహ విక్రయాల జోరుకు ఐటీ రంగంలోని లేఆఫ్స్ , నియామకాలు తగ్గడం వల్ల బ్రేకులు వేస్తున్నాయి. 2026 మొదటి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 4 శాతం మేర తగ్గాయి. ఐటీ నిపుణులు ఎక్కువగా ఉండే బెంగళూరు, హైదరాబాద్ , పుణె వంటి నగరాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
సాధారణంగా ఐటీ ఉద్యోగులు గృహ విక్రయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం గ్లోబల్ టెక్ కంపెనీలలో జరుగుతున్న ఉద్వాసనలు , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేస్తున్నారు. ఫలితంగా, అటు కొనుగోళ్లు తగ్గడమే కాకుండా, నగరాల్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా 2 శాతం మేర క్షీణించింది. ముఖ్యంగా మధ్యతరగతి ఇళ్ల విభాగంలో ఈ మందగమనం ఎక్కువగా ఉందని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది.
కేవలం ఉద్యోగ కోతలు మాత్రమే కాకుండా, గత కొద్ది కాలంగా ఇళ్ల ధరలు విపరీతంగా పెరగడం కూడా కొనుగోలుదారుల స్థోమత పై దెబ్బకొట్టింది. ధరలు ఆకాశాన్ని తాకడం , బ్యాంక్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండటంతో సామాన్య కొనుగోలుదారుడు వెనకడుగు వేస్తున్నాడు. నైట్ ఫ్రాంక్ గణాంకాల ప్రకారం, అమ్ముడుపోని ఇళ్ల నిల్వలు కూడా 3 శాతం పెరిగి సుమారు 5.2 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. ఇది మార్కెట్లో డిమాండ్ తగ్గుతున్న సంకేతాలకు నిదర్శనం.
అయితే సంపన్న వర్గాలు, ఎన్ఆర్ఐలు ఇప్పటికీ లగ్జరీ ఆస్తులపై పెట్టుబడులు పెడుతున్నారు. కానీ, సామాన్య సాఫ్ట్వేర్ ఉద్యోగులపై ఆధారపడిన మిడ్-రేంజ్ మార్కెట్ మళ్లీ కోలుకోవాలంటే ఐటీ రంగంలో స్థిరత్వం రావాల్సిందేనని భావిస్తున్నారు.
