కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా తెరవెనుక సాగుతున్న లీడర్షిప్ మార్పు వ్యవహారం ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. మే 28వ తేదీ గురువారం నాడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన నివాసంలో క్యాబినెట్ మంత్రులందరికీ ప్రత్యేక అల్పాహార విందు ఏర్పాటు చేశారు. రాజకీయ వర్గాల్లో దీనిని సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రిగా చివరి విందు గా అభివర్ణిస్తున్నారు. ఆ సమావేశంలో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సమావేశం తర్వాత గవర్నర్ వద్దకు వెళ్లి రాజీనామా ఇవ్వనున్నారు.
రాజీనామాకు ఆదేశించిన హైకమాండ్
ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్‌తో సుదీర్ఘంగా జరిగిన హైవోల్టేజ్ చర్చల అనంతరం, మే 28నే ఆయన తన రాజీనామా చేయాలని ఆదేశించారు. రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో విడివిడిగా, ఉమ్మడిగా పలు రౌండ్ల చర్చలు జరిపారు. జూన్ 18న జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో సిద్ధరామయ్యను బరిలోకి దించి, ఆయనను ఢిల్లీ కేంద్రంగా జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని హైకమాండ్ గట్టిగా ప్రతిపాదించింది.
రాజ్యసభకు సిద్ధరామయ్య
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న కులగణన, సామాజిక న్యాయం నినాదానికి దేశంలోనే అత్యంత కీలకమైన ఓబీసీ ముఖచిత్రంగా ఉన్న సిద్ధరామయ్య సేవలను ఢిల్లీలో ఉపయోగించుకోవాలనేది అధిష్ఠానం వ్యూహం. సిద్ధరామయ్య ఒకవేళ రాజ్యసభ రూట్ ఎంచుకుని సీఎం పదవి నుంచి తప్పుకున్నా.. తదుపరి ముఖ్యమంత్రి పీఠం డీకే శివకుమార్‌కు దక్కుతుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. 2023 ఎన్నికల విజయం తర్వాత సగం పదవీకాలం ముగిశాక పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం తనకు సీఎం పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ గట్టిగా పట్టుబడుతున్నారు. కానీ, సిద్ధరామయ్య వర్గం మాత్రం డీకే శివకుమార్‌కు పదవి అప్పగించడానికి అంత సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
శివకుమార్‌కు హైకమాండ్ హ్యాండిస్తుందా?
ఒకవేళ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరకపోతే.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే కర్ణాటకకు సీఎంగా పంపే ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ అధికారికంగా లీడర్షిప్ మార్పు వార్తలను ఖండిస్తూ, ఇదంతా కేవలం రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం జరిగిన సాధారణ సమావేశమేనని చెప్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం పవర్ ట్రాన్స్ఫర్ స్క్రిప్ట్ సిద్ధమైపోయింది. మే 28 ఉదయం క్యాబినెట్ సహచరులతో సిద్ధరామయ్య నిర్వహించే బ్రేక్‌ఫాస్ట్ మీట్ ముగిసిన తర్వాత బెంగళూరులోనే ఏర్పాటు చేసే ప్రెస్మీట్లో ఈ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడనుంది. సిద్ధరామయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో గౌరవప్రదంగా రాజీనామా చేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తారా, లేక కర్ణాటక కాంగ్రెస్‌లో సరికొత్త అంతర్గత సంక్షోభం మొదలవుతుందా అనేది మరో 24 గంటల్లో తేలిపోనుంది.
