యువ హీరోల్లో కొంతమంది నిర్మాణ రంగంవైపు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘క ప్రొడక్షన్స్’ పేరుతో ఆయన నిర్మాణ సంస్థని స్థాపించారు. ఈ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ‘తిమ్మరాజు పల్లి టీవీ’. ఈనెల 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాలో పని చేసినవాళ్లంతా కొత్త వాళ్లే. ఈ సినిమాతో దాదాపు 50 మంది నూతన నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు కిరణ్. ఇందులో 20 మంది నాటక రంగం నుంచి వచ్చినవాళ్లే. ఇంతమందికి ఓ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం, దానికి ఓ హీరో నిర్మాత అవ్వడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి. ఓ దశలో కిరణ్ ఈ సినిమాలో హీరోగా నటిద్దామనుకొన్నాడట. కానీ.. తాను హీరో అయితే, కథలో తన కోసం కొత్తగా ఎలిమెంట్స్ జోడించాల్సి వస్తుందని, అలా చేస్తే, కథలో ఉన్న జెన్యునిటీ మిస్ అవుతుందని కిరణ్ భావించాడట. అందుకే ఆ ప్రయత్నం విరమించుకొన్నాడు.
ఈ సినిమాని కొనడానికి ఓ ఓటీటీ సంస్థ కూడా ముందుకు వచ్చిందని తెలుస్తోంది. అయితే థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీకి అమ్మేయాలన్నది ఒప్పందం. కానీ.. ఈ సినిమా ఓటీటీకి వెళ్లిపోతే, ఇంతమంది కళాకారుల ప్రతిభ మరుగున పడిపోతుందేమో అని కిరణ్ ఆలోచించి, ఆ ప్రయత్నం విరమించుకొన్నాడు. ఓటీటీకి అమ్మేస్తే నిర్మాతగా కిరణ్ సేఫ్ అయ్యేవాడు. కానీ 50మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల కోసం ఆలోచించాడు కాబట్టి, థియేట్రికల్ రిలీజ్ వైపే మొగ్గు చూపించాడు. 9న ట్రైలర్ బయటకు రాబోతోంది. కిరణ్ నమ్మిన విషయం ఏమిటో, ఈ కంటెంట్ లో ఉన్న బలమెంతో ఆ రోజు తెలిసిపోతుంది.
అన్నట్టు కిరణ్ దర్శకత్వం వైపు అడుగులేస్తున్నాడు. తన డైరెక్షన్లో ‘రియాలిటీ’ అనే సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
