తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకప్పుడు తండ్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన అన్నచెల్లెళ్లు కేటీఆర్, కవిత.. ఇప్పుడు గులాబీ జెండా వారసత్వం కోసం, ముఖ్యంగా TRS అనే బ్రాండ్ నేమ్ కోసం పోటీపడుతున్నారు. అంతే కాదు పోటాపోటీగా పాదయాత్రలు కూడా చేయబోతున్నారు. ఈ పరిణామం రాజకీయాల్లో మౌలికమైన మార్పులు తీసుకురానుంది.
పేరు మార్పే కొంపముంచిందా?
బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాతే పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని ఆ పార్టీ శ్రేణుల్లో బలమైన నమ్మకం ఉంది. దీనిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనం మళ్లీ టీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నాం.. పేరు మార్పు వల్లే ఓడిపోయాం అని ఆయన బాహాటంగానే ఒప్పుకున్నారు. పార్టీని మళ్లీ తెలంగాణకే పరిమితం చేసి, పోగొట్టుకున్న వైభవాన్ని వెతకాలని కేటీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. తన నాయకత్వంలోనే టీఆర్ఎస్ రీ-లాంచ్ జరగాలని ఆయన భావిస్తున్నారు.
కవిత TRS ప్లాన్ – కొత్త అజెండాతో పాత పేరు!
మరోవైపు, కవిత కూడా టీఆర్ఎస్ పేరుపై కన్నేశారు. టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పాత పేరుతో, కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళా లోకాన్ని, తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి తనవైపు తిప్పుకోవడానికి TRS అనే బ్రాండ్ తనకు ఆయుధంగా మారుతుందని కవిత భావిస్తున్నారు. అన్న కంటే ముందే ఆమె తన రాజకీయ భవిష్యత్తు కోసం ఈ పేరును క్లెయిమ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆస్తిగా మారిన TRS బ్రాండ్
ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఒక జాతీయ పార్టీగా ఉంది. కానీ, తెలంగాణ ప్రజల గుండెల్లో మాత్రం కారు గుర్తు టీఆర్ఎస్కే అంకితమైపోయింది. అందుకే ఇప్పుడు TRS అనేది కేవలం ఒక పేరు కాదు, అది ఒక రాజకీయ ఆస్తి . ఈ ఆస్తిని దక్కించుకున్న వారే తెలంగాణలో కేసీఆర్ వారసుడిగా చెలామణి అయ్యే అవకాశం ఉంది. అందుకే అన్నచెల్లెళ్లు ఇద్దరూ ఈ పేరు చుట్టూ తమ రాజకీయ ఎత్తుగడలను వేస్తున్నారు. ఎవరికి వారు తామే అసలైన తెలంగాణ వాదులమని నిరూపించుకోవడానికి తాపత్రయపడుతున్నారు.
పోటాపోటీగా పాదయాత్రలు కూడా !
ఈ ఇద్దరు నేతలు కూడా త్వరలోనే పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించుకోవడం మరో విశేషం. కేటీఆర్ తన పాదయాత్ర ద్వారా పార్టీ యంత్రాంగాన్ని ఉరకలెత్తించాలని చూస్తుంటే, కవిత మాత్రం క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ తన ఇమేజ్ను ప్రక్షాళన చేసుకోవాలని చూస్తున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు నేతలు, ఒకే పేరు కోసం, ఒకే రకమైన కార్యచరణతో బయలుదేరడం పార్టీ క్యాడర్, ఓటు బ్యాంకులో చీలిక తేవడం ఖాయంా కనిపిస్తోంది. గులాబీ గూటిలో జరుగుతున్న ఈ వారసత్వ , బ్రాండ్ యుద్ధం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీయడం ఖాయం.


