కుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ, తన నీలి కళ్లతో కోట్లాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న వైరల్ సుందరి మోనాలిసా భోంస్లే జీవితం ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఒక సామాన్య అమ్మాయిగా వెలుగులోకి వచ్చిన ఆమె, ఇప్పుడు తన ప్రేమ కోసం కన్నవారిని ఎదిరించి వేరే రాష్ట్రం వెళ్లి పోలీసులను ఆశ్రయించింది.
ఫేస్బుక్ పరిచయంతో మొదలైన ఆమె ప్రేమకథ, మతాల సరిహద్దులు దాటి కేరళ తీరానికి చేరుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా, మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో గత ఏడాదిన్నరగా పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ బంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం ఆమె కేరళకు రాగా, వెంటాడిన తండ్రి ఎర్నాకులంలో ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు రైలెక్కి నేరుగా తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
నేను మేజర్ని.. నా ఇష్టప్రకారం ఫర్మాన్తోనే జీవించాలనుకుంటున్నాను అని ఆమె పోలీసుల ముందు తెగేసి చెప్పింది. కన్నతండ్రిపై ఫిర్యాదు చేయడానికి మనసు రాకపోయినా, తన ప్రేమను గెలిపించుకోవడానికి మాత్రం ఆమె వెనకడుగు వేయలేదు. సినిమా షూటింగ్ కోసం వచ్చిన చోటే తన నిజ జీవిత ప్రేమాయణానికి క్లైమాక్స్ రాసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు కేరళ పోలీసులు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా సెన్సేషన్ నుండి పోలీస్ స్టేషన్ మెట్ల వరకు సాగిన మోనాలిసా లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
