ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడిని శరవేగంగా గ్రౌండింగ్ చేస్తోంది. తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో సుమారు రూ. 5,000 కోట్ల పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన ప్రతిష్టాత్మక తయారీ కేంద్రాన్ని శరవేగంగా నిర్మిస్తోంది. 2025 మే నెలలో భూమి పూజ జరుపుకున్న ఈ ప్రాజెక్టు, కేవలం కొన్ని నెలల్లోనే గణనీయమైన పురోగతిని సాధించింది. దాదాపు 247 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ ప్లాంట్, భారతదేశంలో ఎల్జీకి మూడవ అతిపెద్ద తయారీ కేంద్రం కానుంది. నోయిడా, పూణేల తర్వాత దక్షిణ భారతదేశంలో ఎల్జీ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి భారీ ప్లాంట్ ఇదే .
ఎల్జీప్లాంట్ పురోగతిని నారా లోకేష్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దాదాపు 1,500 మందికి నేరుగా, మరో 10,000 మందికి పైగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. ఎల్జీతో పాటు దానికి సంబంధించిన మరో నాలుగు అనుబంధ సంస్థలు కూడా రూ. 839 కోట్ల పెట్టుబడితో ఇక్కడే తమ యూనిట్లను ఏర్పాటు చేస్తుండటంతో ఒక సమగ్రమైన ‘వైట్ గుడ్స్’ మాన్యుఫ్యాక్చరింగ్ ఇకోసిస్టమ్ ఇక్కడ తయారవుతోందని నారా లోకేష్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రపంచస్థాయి తయారీ కేంద్రంలో రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు , వాటికి సంబంధించిన కీలక విడిభాగాలను ఉత్పత్తి చేయనున్నారు. 2026 చివరి నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, 2029 నాటికి దశలవారీగా తన కార్యకలాపాలను విస్తరించనుంది. ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 1.5 మిలియన్ ఏసీలు, 2 మిలియన్ కంప్రెషర్లు, మరియు లక్షలాది రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఏపీని ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
