మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వె ళ్లారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు చెప్పనున్నారు. అనిశ్చితిలో ఉన్న రాజధాని అంశానికి కేంద్రం , రాష్ట్రపతి కార్యాలయం నుంచి లభించిన ఈ ఆమోదం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ భేటీ ద్వారా అమరావతి నిర్మాణం కేవలం రాష్ట్ర ప్రాధాన్యతే కాదు, జాతీయ స్థాయిలో దానికి ఉన్న గుర్తింపును లోకేష్ మరోసారి చాటిచెప్పనున్నారు.
వేగంగా మారుతున్న ఏపీ రాజకీయ పరిణామాలు
ప్రస్తుతం ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, శాంతిభద్రతల అంశంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో కేంద్రంలోని పెద్దలకు రాష్ట్రంలోని తాజా పరిస్థితులను వివరించడం, విచారణ సంస్థల నుంచి ఆశిస్తున్న సహకారం గురించి చర్చించే అవకాశం ఉంది. లోకేష్ పర్యటన ద్వారా కేంద్ర-రాష్ట్రాల మధ్య రాజకీయ సమన్వయాన్ని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
కీలక మంత్రులతో భేటీ
నారా లోకేష్ ప్రతి ఢిల్లీ పర్యటనలోనూ తన శాఖలకు సంబంధించిన కీలక అంశాలను ఎజెండాగా పెట్టుకుంటారు. ఈసారి కూడా కేంద్ర ఐటీ, రైల్వే , పరిశ్రమల శాఖ మంత్రులను కలిసి ఏపీలో రాబోయే భారీ ప్రాజెక్టుల గురించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖ ఐటీ హబ్, అమరావతిలో నిర్మించబోయే నాలెడ్జ్ సిటీ కి అవసరమైన కేంద్ర నిధులు, అనుమతులపై ఆయన దృష్టి సారించనున్నారు. లోకేష్ పర్యటన అంటేనే రిజల్ట్ ఓరియెంటెడ్ అనే ముద్ర ఉండటంతో, ఈసారి కూడా ఏవైనా కొత్త ప్రకటనలు వెలువడవచ్చని భావిస్తున్నారు.
జాతీయ స్థాయిలో లోకేష్ ఇమేజ్ బిల్డింగ్
గతంతో పోలిస్తే నారా లోకేష్ ఇప్పుడు ఒక పరిణతి చెందిన నాయకుడిగా జాతీయ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వంతో ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలు పార్టీకి పెద్ద అసెట్‌గా మారాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా సంస్కరణలు, యువతకు ఉపాధి కల్పన వంటి అంశాలను ఢిల్లీ వేదికగా ప్రమోట్ చేయడం ద్వారా తన నాయకత్వ పటిమను చాటుకుంటున్నారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా చక్రం తిప్పడమే ఈ పర్యటన వెనుక ఉన్న కీలక లాజిక్.


