రాజధానిని మార్చాలనే వింత ఆలోచన ప్రపంచంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డికే వస్తుందని, ఆయన పరిపాలనా తీరును చూసి ప్రజలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ సినిమా చూపించారని మంత్రి నారా లోకేష్ సెటైర్ వేశారు. అది ఆయనకు అర్థం కావడం లేదన్నారు. పాదయాత్ర చేసి టీడీపీకి సినిమా చూపిస్తానన్న జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. జగన్ సినిమా 11 రోజులు కూడా ఆడదన్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ చారిత్రాత్మక సమయంలో అసెంబ్లీకి రాకుండా గైర్హాజరవ్వడం ద్వారా వైసీపీకి చిత్తశుద్ధి లేమిని మరోసారి బయటపెట్టుకుందని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డికి ఆత్మలతో మాట్లాడే అలవాటు ఇంకా పోలేదని లోకేష్ ఈ సందర్భంగా చమత్కరించారు. ఏ ఆత్మ జగన్తో ఏం మాట్లాడిస్తుందో అని వైసీపీ నేతలే ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, అవాస్తవ ప్రచారాలతో కాలం గడిపే జగన్ రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజలు ఆయన తుగ్లక్ చర్యలను ఇక ఏమాత్రం సహించబోరని స్పష్టం చేశారు.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. కనీసం పార్లమెంట్ వేదికగానైనా వైసీపీ తన స్పష్టమైన వైఖరిని బయటపెడుతుందో లేక గతంలోలాగే బాధ్యతల నుంచి తప్పించుకుని బెంగళూరుకు పారిపోతుందో చూడాలన్నారు. రాజధాని విషయంలో ఎన్ని కుట్రలు చేసినా, తుది విజయం అమరావతిదేనని, చట్టబద్ధత రావడంతో రాజధాని భవిష్యత్తు సురక్షితమవుతుందని స్పష్టం చేశారు.


