ఉస్మానియాలో రాజకీయ స‌భ‌లు నో ఎంట్రీ..!

తెలంగాణ ఉద్య‌మంలో విద్యార్థి లోకం ఎంత కీల‌క పాత్ర పోషించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ వ‌స్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వ‌స్తాయ‌ని వారు ఆశించారు. అయితే, రాష్ట్రం వ‌చ్చాక, కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక ప‌రిస్థితి మారింది. నామ్ కే వాస్తే అన్న‌ట్టుగా కొన్ని నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేశారే త‌ప్ప‌… పెద్ద సంఖ్య‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల నియామ‌కం జ‌ర‌గ‌లేదు. దీంతో కేసీఆర్ స‌ర్కారు తీరుపై విద్యార్థి లోకం ఆక్రోశంతోనే ఉంది. ఇటీవ‌లే ఉస్మానియా శ‌తాబ్ధి ఉత్స‌వాలు జ‌రిగితే… ఆ స‌భ‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌సంగించ‌ని సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే, కేసీఆర్ మైక్ ప‌ట్టుకుంటే విద్యార్థుల నుంచి నిర‌స‌న‌లు వినిపిస్తాయి క‌దా! అందుకే ఆయ‌న మౌనముద్ర దాల్చారు. ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఉస్మానియా నుంచి తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణంలో ఎలాంటి రాజ‌కీయ స‌భ‌ల‌కూ అనుమ‌తి ఇచ్చేలేదంటూ యూనివ‌ర్శిటీ స్ప‌ష్టం చేసింది.

ఇప్ప‌టికిప్పుడు ఇలాంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల అయిందంటే… దీని వెన‌క ఎవ‌రి ఒత్తిళ్లు ప‌నిచేసి ఉంటాయో అంద‌రికీ అర్థ‌మౌతూనే ఉంది! తెలంగాణ‌లో విద్యార్థి లోకం నుంచి కేసీఆర్ పై వ్య‌క్త‌మౌతున్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధ‌మౌతోంది. దీన్లో భాగంగా ల‌క్ష‌మంది విద్యార్థుల‌తో ఒక భారీ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. దీనికి ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించ‌బోతున్న‌ట్టు ఈ మ‌ధ్య మీడియాలో వార్త‌లు వ‌చ్చేశాయి. ఈ భారీ కార్య‌క్ర‌మానికి ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యాన్ని వేదిక‌గా చేసుకోవాల‌ని టి. కాంగ్రెస్ భావిస్తోంది. సో… తాజా నిర్ణయానికి కార‌ణం ఏమై ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం ఏముంది చెప్పండీ..!

కాంగ్రెస్ వ్యూహాన్ని అడ్డుకోవాల‌న్న ఉద్దేశంతోనే ఉస్మానియాలో రాజ‌కీయ స‌భ‌ల‌కు అనుమ‌తులుండ‌వంటూ ఆదేశాలు జారీ చేయించేలా పెద్ద‌లు ఒత్తిడి తెచ్చి ఉంటార‌ని అంటున్నారు! విద్య‌తో సంబంధం లేని ఎలాంటి స‌భ‌ల నిర్వ‌హ‌ణ‌కూ వ‌ర్శిటీలో అనుమ‌తులూ ఇవ్వ‌కూడ‌ద‌ని యాజ‌మాన్యం తాజా ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక‌ప్పుడు తెరాస ఉద్య‌మానికి కొండంత అండ‌గా నిలిచిన విద్యార్థుల విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ధోర‌ణి ఇలా మారుతోంది. ఎన్నో ఉద్య‌మాల‌కు వేదికైన వ‌ర్శిటీ ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటోంది. అయితే, తాజా నిర్ణ‌యంపై విద్యార్థులు ఎలా స్పందిస్తార‌న్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com