పద్మ పురస్కారాలు దేశానికి విభిన్న రంగాల్లో తమ వంతు కంట్రిబ్యూషన్ ఇచ్చిన వారికి ఇచ్చేందుకు స్థాపించినవి. ఆ అవార్డుల ద్వారా వచ్చేది .. వారు దేశానికి సేవ చేశారని గుర్తింపు. కానీ దశాబ్దాల పాటు ఈ అవార్డులు సిఫార్సులు బలంగా చేయించుకున్నవారికే వచ్చేవి. అందుకే వాటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. కానీ గత కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పద్దతిని మార్చేసింది. నిజంగా దేశానికి తమ ప్రతిభతో..సేవతో..కళతో సేవ చేసిన వారికే ఇస్తున్నారు. ఈ సారి కూడా ఆ సంప్రదాయం తప్పలేదు.
అర్హునలైన వారికి ఇవ్వడంలో వందకు వంద మార్కులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ పురస్కారాల జాబితా, అవార్డుల ఎంపికలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అద్దం పడుతోంది. రాజకీయ సిద్ధాంతాలు, పార్టీ ప్రయోజనాలకు అతీతంగా కేవలం దేశ సేవను, అర్హతను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని పురస్కారాలను అందించడంలో మోదీ ప్రభుత్వం వందకు వంద మార్కులు కొట్టేసింది. కరడుగట్టిన విమర్శకులు సైతం మెచ్చుకునేలా, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన అసాధారణ వ్యక్తులను వెలికితీసి గౌరవించడం ఒక గొప్ప సంప్రదాయంగా మారింది.
దశాబ్దాల పాటు రాజకీయ సిఫారసులకే పెద్దపీట
గతంలో కాంగ్రెస్ హయాంలో పద్మ పురస్కారాల ఎంపికపై అనేక విమర్శలు ఉండేవి. ప్రధానంగా ఢిల్లీ వర్గాల్లో పట్టున్న వారు, సిఫార్సుల ద్వారా లేదా రాజకీయ పలుకుబడితో ఈ అవార్డులను పొందుతున్నారనే అభిప్రాయం బలంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దరఖాస్తు చేసుకోకపోయినా, ప్రచారానికి దూరంగా ఉంటూ నిశ్శబ్దంగా సమాజ సేవ చేస్తున్న అన్సంగ్ హీరోస్ కోసం వెతికి మరీ పద్మ గుర్తింపు ఇస్తున్నారు. ఇది ఒక పారదర్శకమైన, ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థకు నిదర్శనం.
రాజకీయాలు, సిద్ధాంతాల తేడాలు చూడటం లేదు !
రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీల నేతలను కూడా వారి సేవలకు గాను సత్కరించడం ద్వారా ప్రధాని మోదీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. వీఎస్ అచ్యుతానందన్, షిబూ సోరెన్ వంటి నేతల ఎంపికే దీనికి నిదర్శనం. రాజకీయంగా ఎంతటి తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ, ప్రజా జీవితంలో వారు చూపిన ముద్రను ప్రభుత్వం గౌరవించింది. వ్యక్తులు మారవచ్చు, కానీ దేశానికి వారు చేసిన సేవ శాశ్వతం అనే సంకేతాన్ని ఈ నిర్ణయాలు పంపిస్తున్నాయి.
అర్హత లేని వారు ఎవరూ ఉండటం లేదు !
కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యూహాల కోసమే కొంతమందికి అవార్డులు ఇస్తున్నారనే వాదనలు వినిపించినప్పటికీ, ఎంపికైన వారి వ్యక్తిగత అర్హతలను ఎవరూ వేలెత్తి చూపలేని పరిస్థితి ఉంది. కళా, సాహిత్య, సామాజిక , క్రీడా రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేయడంలో ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత ప్రశంసనీయం. రాజకీయం అనేది ఎన్నికల వరకేనని, దేశ గౌరవం విషయానికి వస్తే అందరూ ఒక్కటేననే భావనను ఈ పురస్కారాల పంపిణీ కలిగిస్తోంది. పద్మ పురస్కారాల ఎంపికలో నెలకొన్న ఈ సానుకూల మార్పు దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య సంప్రదాయానికి పునాది వేస్తోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ, వారు ఏ మూలన ఉన్నా ఏదో ఒక రోజు గుర్తింపు లభిస్తుందనే నమ్మకాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తోంది. ఇలాంటి నిష్పాక్షికమైన వ్యవస్థ కొనసాగడం దేశాభివృద్ధికి, సామాజిక చైతన్యానికి ఎంతో అవసరం.
