జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదువులు … కూటమిలో భాగంగా వచ్చేలా చేస్తున్నారు. వారంతా దాదాపుగా రాజకీయాలకు ఇంకా చెప్పాలంటే రాజకీయ పదవులకు కొత్త. అందుకే వారందరికీ పదవులు అంటే హోదా,దర్పం ప్రదర్శించడానికి కాదని.. అది బాధ్యత అని అవగాహన కల్పించాలని అనుకుంటున్నారు. పదవులు పొందిన వారందరితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 22న ‘పదవి-బాధ్యత’ పేరుతో పదవులు పొందిన అదంర్నీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి !
గత ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించి, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. కేవలం పదవులు పొందడమే కాకుండా, ఆ పదవుల ద్వారా ప్రజలకు జవాబుదారీగా ఎలా ఉండాలో వివరించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశానికి కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన జనసేన నేతలందరూ హాజరుకానున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా స్థాయి పదవులు , మార్కెట్ యార్డ్, పీఏసీఎస్ వంటి సంస్థల్లో పదవులు పొందిన కీలక నేతలు ఇందులో పాల్గొంటారు.
దాదాపుగా అంతా కొత్తగా రాజకీయ పదవులు పొందిన వారే
జనసేన పార్టీలో కూటమి తరపున నామినేటెడ్ పోస్టులు పొందుతున్న వారంతా దాదాపుగా కొత్తవారే. వారు పదవులను అర్థం చేసుకోలేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. అందుకే పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పదవి అనేది అలంకారం కాదు, అది ఒక బాధ్యత అనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా గట్టిగా చెప్పనున్నారు. పదవులను దుర్వినియోగం చేస్తే రాజకీయంగా బలహీనపడతామని.. రాజకీయ జవాబుదారీతనం ముఖ్యమని వివరించనున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను నిలబెట్టుకుంటూనే, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన దిశా నిర్దేశం చేయనున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, అవినీతికి తావులేకుండా పారదర్శకమైన పాలనలో ఎలా భాగస్వామ్యం వహించాలి అనే విషయాలపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారు.
పార్టీ బలోపేతానికి సూచనలు
రాజకీయాలంటే కేవలం అధికారం అనే భావన ఉండేదని, కానీ జనసేన ఆ సంస్కృతిని మార్చాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా నేతలకు కేటాయించిన బాధ్యతలపై సమీక్ష నిర్వహించడంతో పాటు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడం కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం. ముఖ్యంగా యువత , మహిళా నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తూ, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక బలమైన కేడర్‌ను నిర్మించడమే పవన్ కళ్యాణ్ ముందున్న అసలైన బాధ్యతగా కనిపిస్తోంది.
