వైసీపీ హయాంలో అప్పటి అధికార పార్టీ నేతలకు, వారి అనుచరులకు తుపాకీ లైసెన్సులు విచ్చలవిడిగా ఇచ్చారు. రౌడీ షీటర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, వివాదాస్పద సెటిల్మెంట్లు చేసే నేతలకు విచ్చలవిడిగా లైసెన్సులు మంజూరు చేశారు. ఒకానొక దశలో జిల్లాలో దాదాపు 850కి పైగా లైసెన్సులు ఉంటే, అందులో పాతిక మందికి పైగా హత్య కేసుల్లో నిందితులు ఉన్నారు. కేవలం రాజకీయ పలుకుబడే అర్హతగా, ఎంపీ అవినాష్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతల సన్నిహితులకు పోలీసుల ద్వారా లైసెన్సులు ఇప్పించి జిల్లాలో ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపించారు. ఇప్పుడు అలాంటి వారందరి లైసెన్సుల్ని రద్దు చేస్తున్నారు.
ఐదు సంవత్సరాల పాటు మాఫియా రాజ్
లైసెన్సుడు తుపాకులను ఆత్మరక్షణ కోసం కాకుండా, సామాన్యులను బెదిరించడానికి, భూ కబ్జాలు చేయడానికి, ఎర్రచందనం స్మగ్లింగ్‌లో రక్షణగా వాడుకున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలు బహిరంగంగానే తుపాకులతో ప్రత్యర్థులను బెదిరించిన ఘటనలు అనేకం. హనుమంతరెడ్డి, వీరనాగిరెడ్డి వంటి నేతలు తమకున్న గన్ లైసెన్సులతో అరాచకాలు సృష్టించారని, వీరికి అదనంగా గన్మెన్లను కూడా కేటాయించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహించిందని విచారణలో తేలింది. దీనివల్ల సామాన్య ప్రజలు ఫిర్యాదు చేయడానికి కూడా భయపడే పరిస్థితి నెలకొంది.
పోలీసుల సంచలన నిర్ణయం – లైసెన్సుల రద్దు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జిల్లాలో శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నేర చరిత్ర కలిగిన వారు, స్మగ్లింగ్ కేసులు ఉన్నవారు , నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు పొందిన వారి చిట్టా తీశారు. వందల సంఖ్యలో ఉన్న ఈ అక్రమ లైసెన్సులను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లర్ల దగ్గర ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా వారి నెట్‌వర్క్‌ను దెబ్బతీశారు. గతంలో అధికార బలంతో రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.
క్లీన్ ఆపరేషన్
ప్రస్తుతం కడప జిల్లాలో పోలీసులు చేపట్టిన ఈ క్లీన్-అప్ ఆపరేషన్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తుపాకీ పట్టుకుని దౌర్జన్యం చేసే సంస్కృతికి అడ్డుకట్ట వేయడం ద్వారా, జిల్లాలో భయానక వాతావరణం తొలగిపోతుందని ఆశిస్తున్నారు. నేరగాళ్లకు లైసెన్సులు ఇచ్చిన గత అధికారులపై కూడా అంతర్గత విచారణ జరిగే అవకాశం ఉంది. గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కడప, ఇప్పుడు మళ్లీ ప్రశాంతత వైపు అడుగులు వేస్తోంది.
