మెరుగైన రిటర్న్స్ ఆశించే ఇన్వెస్టర్లకు ప్రీమియం ఫ్లాట్లు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారాయి. అయితే, ఇందులో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ గమనాన్ని విశ్లేషించడం అవసరం. సాధారణ అపార్ట్మెంట్లతో పోలిస్తే ప్రీమియం ఫ్లాట్లు 2 కోట్లకుపైగా విలువైనవి ఉంటాయి. దరాబాద్‌లోని కోకాపేట, గచ్చిబౌలి ఏరియాల్లో ప్రీమియం ప్రాజెక్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. బడా బిల్డర్లు నిర్మించే ఈ ప్రాజెక్టుల్లో నాణ్యత, అంతర్జాతీయ స్థాయి అమినిటీస్ ఉండటం వల్ల ఐదేళ్ల కాల పరిమితిలో వీటి విలువ 40% నుండి 60% వరకు పెరిగే అవకాశం ఉంది. రిటర్న్స్ అనేవి కేవలం అద్దె రూపంలోనే కాకుండా, ఆస్తి విలువ పెరగడం ద్వారా భారీగా లభిస్తాయి.
ప్రీమియం ఫ్లాట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల లభించే అతిపెద్ద ప్రయోజనం అధిక అద్దె ఆదాయం. ఐటీ కంపెనీల సీఈఓలు, ఉన్నతాధికారులు , ఎన్ఆర్ఐలు ఇటువంటి విలాసవంతమైన గృహాల్లో నివసించడానికి మొగ్గు చూపుతారు. సాధారణ ఫ్లాట్లతో పోలిస్తే వీటిపై అద్దెలు 30% నుండి 50% వరకు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు, హైదరాబాద్ పశ్చిమ భాగంలో ప్రీమియం త్రీ-బీహెచ్‌కే ఫ్లాట్‌కు నెలకు 80,000 నుండి 1.5 లక్షల వరకు అద్దె లభిస్తోంది. స్థిరమైన , అధిక అద్దె ఆదాయం కోరుకునే వారికి ఇది సరైన మార్గం.
ప్రీమియం ఫ్లాట్ల వల్ల రిటర్న్స్ బాగున్నప్పటికీ, వాటి నిర్వహణ ఖర్చులు కూడా భారీగానే ఉంటాయి. చదరపు అడుగుకు 5 నుండి 10 రూపాయల వరకు మెయింటెనెన్స్ చెల్లించాల్సి రావచ్చు, ఇది మీ నికర ఆదాయాన్ని కొంత తగ్గిస్తుంది. అలాగే, లగ్జరీ ఫ్లాట్లు అమ్మడం సాధారణ ఫ్లాట్ల అంత సులభం కాదు. వీటికి కొనుగోలుదారులు పరిమితంగా ఉంటారు కాబట్టి, అత్యవసరంగా నగదు కావాలనుకున్నప్పుడు ఆశించిన ధరకు విక్రయించడం కొంత సమయంతో కూడుకున్న పని.
కనీసం 5 నుండి 7 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో పెట్టుబడి పెట్టాలనుకుంటే ప్రీమియం ఫ్లాట్లు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. కేవలం రెడీ-టు-మూవ్ కాకుండా, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులను ఎంచుకుంటే తక్కువ ధరకు లభించి, పూర్తయ్యే నాటికి అధిక లాభాలను ఇస్తాయి. అయితే, సదరు ప్రాజెక్టుకు RERA ఆమోదం ఉండటంతో పాటు, ఆ ఏరియాలో భవిష్యత్తులో రాబోయే మౌలిక సదుపాయాల గురించి పక్కాగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
