ప్రొ.నాగేశ్వర్ : జగన్, పవన్‌లను కలపాలన్నది ఎవరికి కోరిక..?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుకున్నాయి. చంద్రబాబును ఓడించడానికి.. అన్ని శక్తులూ ఏకమవుతాయన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. పవన్ కల్యాణ్, జగన్మోహన్ రెడ్డిని కలిపేందుకు .. భారతీయ జనతా పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు.. పాతిక సీట్లు కన్నా ఎక్కువ రానిన్వబోమన్న చాలెంజ్ చేస్తున్నారు. పదే పదే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకుంటున్న బీజేపీ ఈ విషయంలో ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబును ఓడించాలంటే జగన్, పవన్ కలవాల్సిందేనా..?

రాజకీయాల్లో… ఓట్ల స్వింగ్ అనేది అత్యంత కీలకం. అది పాజిట్ ఓటు ద్వారా కానీ.. నెగెటివ్ ఓటు ద్వారా కానీ లేదా పొత్తులు పెట్టుకోవడం ద్వారా కానీ… ఓ పార్టీ పాజిటివ్ స్వింగ్ ద్వారా ఓట్లు తెచ్చుకుంటే.. ప్లస్ అవుతుది. అదే నెగెటివ్ స్వింగ్ ద్వారా ఓట్లు పోగొట్టుకుంటే మైనస్ అవుంది. ఏదైనా ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు స్వింగ్ అయితే.. ఫలితం తారుమారు అవడానికి అవకాశం ఉంది. తెలగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా పదిహేను శాతం ఓట్ల వరకూ స్వింగ్ అయ్యాయి. అందుకే ఘన విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఓట్లు పెరిగాయి. కానీ సీట్లు పెరగలేదు. ఓట్ల స్వింగ్.. టీఆర్ఎస్ వైపు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఆ విజయం నమోదయింది. ఏపీలో… పవన్ కల్యాణ్ – జగన్ కలిస్తే… అది కచ్చితంగా చంద్రబాబుకు ప్రమాదకర పరిణామమే కావొచ్చు. గత ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య అక్కడ రెండు శాతమే తేడా. వీరిద్దరి కలయిక వల్ల… నాలుగైదు శాతం ఓట్లు .. జగన్, పవన్ ల వైపు స్వింగ్ అయినా… విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే… చంద్రబాబును ఓడించాలనుకుంటున్న బీజేపీ మాత్రమే కాదు… చంద్రబాబు ఓడిపోవాలనుకుంటున్న ప్రతీ ఓటర్.. ప్రతి రాజకీయ పార్టీ కూడా.. జగన్, పవన్ కలవాలనుకుంటున్నారు. అలా కలిస్తే.. చంద్రబాబును ఓడిస్తారనే ఆశ.

చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎంత వరకూ పని చేస్తాయి..?

తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవాలనుకున్న వాళ్లంతా. .. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు కదా..! గెలవకపోయి ఉండవచ్చు కానీ.. కేసీఆర్ ను ఓడించడానికి అందరూ కలిశారు. అలాగే.. చంద్రబాబును ఓడించడానికి కూడా.. ఆయన అంటే.. ఇష్టం లేని వారు.. ఆయన మళ్లీ గెలవాలని కోరుకున్న వారందరూ కలవాలని అనుకుంటున్నారు. లేకపోతే.. చంద్రబాబునాయుడు.. తన రాజకీయ సామర్థ్యంతో.. పరిస్థితుల్ని మార్చేయగలరు. ఈ విషయం ప్రత్యర్థులకు కూడా తెలుసు. అందుకే… చంద్రబాబును ఓడించాలంటే.. జగన్, పవన్ కలవాల్సిందే అనేవాళ్ల అభిప్రాయం ఎక్కువగా ఉంది.

టీడీపీ ఓడిపోవాలనుకునే వాళ్లందరూ జగన్, పవన్ కలవాలనుకుంటున్నారా..?

2014లో పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. 2017 వరకూ ఈ పరిస్థితి కొనసాగింది. అయితే.. 2018లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పవన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తీవ్ర వ్యతిరేకిగా మారిపోయారు. అంటే.. గత ఎన్నికల నాటికి ఈ ఎన్నికల నాటికి స్పష్టమైన మార్పు ఉన్నట్లే లెక్క. అయితే.. అది చంద్రబాబును ఓడించడానికి సరిపోతుందని.. ఆయనను ఓడించాలని అనుకుంటున్నవాళ్లు.. అంచనా వేయడం లేదు. జగన్ పవన్ ను కలపడం వల్ల మాత్రమే లక్ష్యాన్ని సాధిచగలమని అనుకుంటున్నారు. అందుకే… చంద్రబాబు ఓడిపోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ… జగన్, పవన్ కలవాలని కోరుకుంటున్నారు. అందులో బీజేపీ కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.