ప్రొ. నాగేశ్వర్ : గెలుపుపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు..?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ అధినేత చంద్రబాబు తనదే గెలుపని చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారని… తనకే అధికారం అని జగన్మోహన్ రెడ్డి… అంటున్నారు. అయితే.. పవన్ కల్యాణ్ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలతో… సీఎం.. సీఎం అని పవన్ పిలిపించుకునేవారు. తాను పల్లకీ మోయడానికి రాలేదని.. స్పష్టం చేసేవారు. తానే ముఖ్యమంత్రిని అవుతాననేవారు. అలాంటిది.. పోలింగ్ ముగిసిన తర్వాత పవన్ సైలెంటవడం… అందర్నీ ఆశ్చర్యపరుసోతంది.

ఎవరెన్ని ప్రకటనలు చేసినా ఈవీఎంలలోని ఫలితం మారదు..!

ప్రజలు తీర్పు ఇచ్చేశారు. ఫలితం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. ఇప్పుడు… తామంటే.. తాము గెలుస్తామని ప్రకటించుకోవడం ద్వారా.. అందులో ఉన్న ఫలితం మారే అవకాశం లేదు. అందుకే పవన్ కల్యాణ్ విధానాన్ని తప్పు పట్టలేం. ఇప్పుడు.. ఎం చేసినా… వచ్చే సీట్లు వస్తాయి. చేయాల్సిన కష్టం చేశారు. ఇక ఫలితం కోసం ఎదురుచూడటమే తప్ప… మరో అవకాశం లేదు. ప్రశాంతంగా ఉండటమే మంచిదని… పవన్ అలా ఫీలయ్యారు. పవన్ కల్యాణ్ తాను సీఎం అవుతానని.. అమాయకంగా చెప్పారని నేను అనుకోను. రాజకీయాల్లో ఉన్నప్పుడు… గెలుస్తామనే విశ్వాసంతోనే ఉండాలి. ఏ మాత్రం విశ్వాసం లేకపోయినా క్యాడర్ చెల్లా చెదురైపోతుంది. దీనికి తగ్గట్లుగానే .. తాను ముఖ్యమంత్రినవుతారనని పవన్ కల్యాణ్ ప్రకటించుకున్నారు.

టీడీపీ, వైసీపీల మధ్య పోరు కేంద్రీకృతం..! జనసేన తట్టుకోలేకపోయిందా..?

పవన్ కల్యాణ్… మొదట్లో ఉన్న ఊపు చూపలేకపోయారని.. బలమైన అభ్యర్థుల్ని పెట్టలేదని.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థులతో పెద్దగా పనేం లేదు.. పవన్ కల్యాణ్‌ను చూసి ఓట్లేస్తారన్న ఉద్దేశంతో బలమైన అభ్యర్థుల్ని పెట్టాల్సిన పని లేదన్న వాదన జనసేన వర్గాల నుంచి వస్తుంది. అయితే.. దీన్ని ఇతర పార్టీలు రాజకీయగా వాడుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహనలో భాగంగానే.. ఇలా అభ్యర్థులను పెట్టలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ రాజకీయ పోరాటం వ్యూహాత్మకంగానే చేశారు. కమ్యూనిస్టులు, బీఎస్పీలతో పొత్తులు పెట్టుకున్నారు. కానీ అది సరిపోలేదు. టీడీపీ, వైసీపీల మధ్య… పూర్తిగా కేంద్రీకృతమైన రాజకీయపోరాటం జరిగింది కాబట్టి.. మరో శక్తిగా ఆవిర్భవించడానికి అవసరమైన బలం.. జనసేనకు.. కమ్యూనిస్టులు, బీఎస్పీతో వచ్చిందని నేను అనుకోను. టీడీపీ, వైసీపీకి సీట్లు బాగా రావొచ్చు. జనసేనకు ఓట్లు.. సీట్లు కూడా రావొచ్చు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు విజయం సాధించవచ్చన్న ప్రచారం జరుగుతోంది.

అధికారం అందుకుంటామని జనసైనికులు కూడా అనుకోవడం లేదా..?

అయితే.. క్లియర్‌గా చెప్పాలంటే.. అధికారానికి పోటీ పడిన ఓ సీరియస్‌ చాలెంజర్‌గా ప్రజలు భావించలేదు. పవన్ కల్యాణ్ కూడా.. అలా ఆశించారని అనుకోను. అందుకే.. తనది పాతికేళ్ల రాజకీయం అని చెబుతూ ఉంటారు. అధికారం వస్తుందా.. రాదా అని.. టీడీపీ, వైసీపీలు కిందా మీదా పడుతున్నాయి. కానీ ఆ టెన్షన్ జనసేనకు లేదు. పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లభిస్తుందా..? అసెంబ్లీలోకి జనసేన ఎమ్మెల్యేలు అడుగుపెడతారా..?. హంగ్ ఏర్పడుతుందా..? హంగ్ ఏర్పడితే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా..? ఇలాంటి సందేహాలు జనసేన క్యాడర్‌లో ఉన్నాయి కానీ..నేరుగా అధికారం దక్కించుకుంటారని .. జనసైనికులు కూడా అనుకోవడం లేదు. జనసేనాధినేతకు… భారీ జనాకర్షణ ఉండొచ్చు.. కమ్యూనిస్టులు, బీఎస్పీలు కలిసినా…. అంత బలంగా మారలేదు. దానికి కారణం.. టీడీపీ, వైసీపీలకు… గ్రామీణ స్థాయిలో ఉన్న నిర్మాణం.. ఆ పార్టీలకు ఉన్న అనుభవంతో… ఈ పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో.. ప్రజారాజ్యం వైఫల్యం కూడా జనసేనకు ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టింది. పవన్ ఇంకా బాగా రాజకీయం చేయాలని ఎవరైనా ఆశించొచ్చు.. కానీ.. ఇప్పటికైతే మంచి ప్రయత్నం చేశారనే విషయాన్ని కొట్టి పారేయలేం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.