Raakaasa Movie Review
Raakaasa Movie Review
తెలుగు360 రేటింగ్: 2.5/5
అనగనగా ఒక రాక్షసుడు. నిద్ర లేచిన ప్రతీసారీ.. ఊరు ఒకర్ని బలి ఇవ్వాలి.. లేదంటే ఊరినే తినేస్తాడు..
ఇలా కథ మొదలెడితే వినడానికి ఎంత ఆసక్తిగా ఉంటుందో కదా? ఫాంటసీ కథలు వర్కవుట్ అయ్యేది ఇక్కడే. ఈ జోనర్లో ఏదైనా చెప్పొచ్చు. ఎలాగైనా చెప్పొచ్చు. కానీ విజువల్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. ప్రేక్షకుల్ని కట్టిపడేసే కథనం రాసుకోవాలి. అలా జరిగితే.. హిట్టు కొట్టినట్టే. ‘రాకాస’లో ఇలాంటి సెటప్పే ఉంది. హారర్, కామెడీ, ఫాంటసీ మిక్స్ చేసిన కథ ఇది. మరి వెండి తెరపై ఈ కథ ఎంత భయపెట్టింది? ఎంత నవ్వించింది? ఎంత మాయ చేసింది?
ఓ ఊరి శాపం ఇది. వందల వేల ఏళ్ల క్రితం నుంచే ఆ ఊరిలోని ఓ కోటలో బ్రహ్మరాక్షసుడు నివసిస్తుంటాడు. తోక చుక్క రాలిపడినప్పుడల్లా… ఆ ఊరి నుంచి ఒకరిని ఆ రాక్షసుడికి బలిదానం చేయాలి. లేదంటే ఊరే వల్లకాడు అవుతుంది. దాంతో ఊరంతా తోక చుక్క ఎప్పుడు పడుతుందా? అంటూ భయం భయంగా ఎదురు చూస్తుంటుంది. ఈసారి తోక చుక్క పడేసరికి అక్కడకి అమెరికా నుంచి వీర బాబు (సంగీత్ శోభన్) వస్తాడు. ఇక్కడో అమ్మాయిని ప్రేమించి.. బకరా అవుతాడు. ఆ ఫస్ట్రేషన్ లో ఆ కోట పరిసరాల్లోకి వెళ్తాడు. అక్కడ్నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఈసారి ఊరంతా ఒకర్ని బ్రహ్మరాక్షసుడికి బలి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంటుంది. ఆ ఒక్కరు ఎవరు? వీరబాబు చేసిన తింగరి పనుల వల్ల జరిగిన అనర్థాలేంటి? బ్రహ్మరాక్షసుడి బారీ నుంచి ఆ ఊరికి విముక్తి దొరికిందా, లేదా? అనేదే మిగిలిన కథ.
చందమామ కథల్లాంటి కథ ఇది. ఇలాంటి సెటప్ లో చాలా చాలా కథలు విన్నాం. చూశాం. అందుకే సెటప్ పరంగా రాకాస కొత్తగా అనిపించకపోవొచ్చు. కానీ వీరబాబుగా సంగీత్ చేసిన అల్లరి, ఆ పాత్ర నుంచి పండించిన వినోదం, సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్‌ని వాడుకొన్న పద్ధతి, బ్రహ్మరాక్షసుడి కథని ముగించిన విధానం ఇవన్నీ ‘రాకాస’ని వన్ టైమ్ వాచ్ మూవీగా మార్చేశాయి. విరగబడి నవ్వుకొనే సన్నివేశాలు ఉండవు కానీ, మొహంపై చిన్న చిరునవ్వు ఎక్కడికీ పారిపోదు. అది లవ్ ట్రాక్ అయినా, హీరో క్యారెక్టర్ని బయటపెట్టే సీన్లు అయినా, బ్రహ్మరాక్షసుడి ఆవాసంలో అయినా.. ఫన్ కంటిన్యూ చేశారు. బ్రహ్మారాక్షసుడి సెటప్ భయంకరంగా ఉంది కానీ, ఆ కోటలో కూడా చేసేది కామెడీనే. ప్రాణాలు పోతున్నాయి అని తెలిసినా.. హీరో అండ్ కో జోవియల్ గా జోకులు వేసుకోవడం తో సీరియస్ నెస్ తగ్గినా, ఫన్ కి ఢోకా లేకుండా పోయింది.
బ్రహ్మరాక్షసుడి ఇతివృత్తంతో కథ మొదలవుతుంది. ఊరి సమస్య ముందే చెప్పేసి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది దర్శకురాలు. వీరబాబు పరిచయం, లవ్ ట్రాక్, కాటుక ఎపిసోడ్ ఇవన్నీ నవ్విస్తుంటాయి. వీరబాబు మర్డర్ కేసులో ఇరుక్కున్నా అందులోంచి ఫన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈ కథలో మర్డర్ కేసేంటి? అనవసరంగా ఇరికించారా, అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో దాన్ని వాడుకోవడం బాగుంది. ఫస్టాఫ్ అంతా బ్రహ్మరాక్షసుడి కోట బయట జరిగే వ్యవహారం. సెకండాఫ్ మొత్తం కోటలోనే. కోటలో హీరో ఒక్కడ్నే కాకుండా గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్ లను కూడా తీసుకురావడంతో బోర్ కొట్టకుండా, ఫన్ మిస్సవ్వకుండా చూసుకోగలిగారు.
హారర్ ఎలిమెంట్స్ మాత్రం ఈ సినిమాలో పూర్తిగా మిస్ అయ్యాయి. అదే పెద్ద లోటు. పేరుకే బ్రహ్మరాక్షసుడు. కానీ భయపెట్టలేకపోయాడు. ఒళ్లంతా మంటతో సినిమా మొత్తం ఒకేరకమైన గ్రాఫిక్స్ లో కనిపిస్తుంటాడు. బ్రహ్మరాక్షసుడి అవతార్‌ని వీఎఫ్ఎక్స్ లో ఎలా కావాలంటే అలా చూపించొచ్చు. కానీ చిత్రబృందం ఈ విషయంలో లిమిటేషన్లు పాటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కోటలో ఇంత జరుగుతున్నా ఊరంతా కామ్ గా ఉంటుంది. కోటలో వెళ్లడానికి రెండో దారి ఉంది.. అని ఊరి పెద్దలకు తెలుసు. కానీ ఆ విషయాన్ని ఎందుకు దాచి ఉంచారు? అనేదానికి లాజిక్ లేదు. వెన్నెల కిషోర్ పది రోజులుగా కోటలో ఉన్నా, తనకేం కాదు. అది కూడా లాజిక్ కి దూరంగా ఉండే పాయింటే. క్లైమాక్స్ కూడా తొందరగా అయిపోయిందన్న ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి థ్రిల్లింగ్ మూమెంట్ తో ఈ కథని ఫినిష్ చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా సెంటిమెంట్ దట్టించడానికి ప్రయత్నించారు.
వీరబాబుగా సంగీత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన కామెడీ టైమింగ్ బాగా ప్లస్సయ్యింది. అక్కడక్కడ మ్యాడ్ సినిమాలోని డీడీ కూడా బయటకు వస్తుంటాడు. కొన్ని చోట్ల `ఖలేజా`లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ గుర్తు చేస్తుంటాడు. తన వల్ల చాలా సీన్లు పండాయి. హీరో తరవాత అన్ని మార్కులు వెన్నెల కిషోర్ కే. సెకండాఫ్ ని తనే గట్టెక్కించాడు. గెటప్ శ్రీను ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ పాత్రకు పెద్ద స్కోప్ లేదు. తన లవ్ ట్రాక్ ని కూడా లైట్ గానే రాసుకొన్నారు.
చిన్న సినిమా ఇది. టెక్నికల్ గా అద్భుతాలేం ఆశించలేం. ఉన్నంతలో బాగానే తీశారు నిహారిక. బ్రహ్మరాక్షసుడి సెటప్ లో వీఎఫ్ఎక్స్ ఇంకాస్త బాగా వర్కవుట్ చేసి ఉండాల్సింది. పెళ్లి పాట సరదాగా ఉంది. ఎండ్ కార్డ్స్ లో వచ్చే పాట హుషారుగా అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ‘ఓకే’ అనిపిస్తుంది. బయటకు వచ్చి గుర్తు చేసుకొని మరీ నవ్వుకొనే సీన్లు లేవు కానీ, పాప్ కార్న్ తింటూ, టైమ్ పాస్ చేసుకొనే సినిమాగా మాత్రం మిగిలిపోతుంది. హారర్, కామెడీ జోనర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు ఓ లుక్ వేయొచ్చు.
తెలుగు360 రేటింగ్: 2.5/5


