సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తమిళ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం పార్టీ నాయకుడు ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారాన్ని రేపాయి. ఈ వివాదంపై రజనీకాంత్ స్పందిస్తూ తాజాగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
అధ్వానంగా అర్జున చేసిన వ్యాఖ్యలను.. అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ రజనీకాంత్ ఈ లేఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన ఎడప్పాడి పళనిస్వామి, అన్నామలై, నైనార్ నాగేంద్రన్, మంత్రులు రఘుపతి, తిరుమావళవన్ తో పాటు తన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ తనదైన శైలిలో స్పందించారు.
ఈ లేఖ చివరలో రజనీకాంత్ ఒక శక్తివంతమైన కోట్‌ను జోడించారు. “కాలం మాట్లాడదు.. కానీ వేచి ఉండి సమాధానం చెబుతుంది” అంటూ ఈ వివాదానికి ముగింపు పలికారు. రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయం ఒత్తిళ్ల వల్ల తీసుకున్నది కాదని, కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుందని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున ఇటీవల ఒక కార్యక్రమంలో రజనీకాంత్ ను కించ పరిచారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అధికార డీఎంకే కుటుంబం బెదిరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ఎంజీఆర్ తర్వాత అంతటి ప్రజాదరణ ఉన్న రజనీకాంత్ వ్యవస్థను మార్చాలని భావించినప్పటికీ, డీఎంకే ఒత్తిళ్లకు లొంగి వెనకడుగు వేశారని, కానీ విజయ్ కు అటువంటి బెదిరింపులను ఎదుర్కొనే ధైర్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో , రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.
ఆధవ్ అర్జున వ్యాఖ్యలను తమిళనాడులోని దాదాపు అన్ని ప్రధాన పార్టీల నేతలు ఖండించారు. రజనీకాంత్ గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడటం సరికాదని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు మంత్రులు కూడా స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడానికి అనారోగ్యం కోవిడ్ పరిస్థితులే కారణమని ఆయన అభిమాన సంఘాలు స్పష్టం చేశాయి. తమిళనాడు వ్యాప్తంగా విజయ్‌కు వ్యతిరేకంగా రజనీ అభిమానులు పోస్టర్లు వేస్తున్నారు.
