కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ జీవన్ రెడ్డి లేఖ విడుదల చేశారు. కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఇప్పటి వరకూ చంద్రబాబు, కేసీఆర్‌లపై పోరాడానని ఇక రేవంత్ రెడ్డిపై పోరాడతానని ప్రకటించారు. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. తనకు ఇవ్వలేదన్న అసంతృప్తి కనిపించకుండా.. చిన్నారెడ్డి, మధుయాష్కీల పేర్లు చెప్పారు. ఇంకా ఎంత మందిని తొక్కుతారని.. ప్రశ్నించారు. కార్యకర్తల కష్టార్జితంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పుడు పాత శత్రువులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని విమర్శించారు.
పార్టీలో తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని, కార్యకర్తల ప్రయోజనాలను కాపాడలేకపోతున్నాననే ఆవేదనతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా లేఖలో చెప్పుకొచ్చారు. గత 20 నెలలుగా తాను తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్యేను పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో అధిష్ఠానం అనుసరిస్తున్న తీరు, సీనియర్లకు ఇస్తున్న ప్రాధాన్యతపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవుల కంటే గౌరవమే ముఖ్యం, అది లేని చోట కొనసాగడం అర్థరహితం అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
తన ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి హత్య ఉదంతాన్ని కూడా జీవన్ రెడ్డి ప్రస్తావించారు. సీనియర్ కార్యకర్త నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైతే, ప్రభుత్వం నుంచి గానీ, పార్టీ నుంచి గానీ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వారి ప్రాణాలకు రక్షణ కల్పించలేనప్పుడు పదవుల్లో ఉండి ప్రయోజనం లేదన్నారు. ప్రజల్లో యాత్ర చేసి.. బీార్ఎస్ పార్టీలో చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు.
