మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. సేలం – బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షైన్ టామ్ చాకో తండ్రి మృతి చెందారు. ఈ ప్రమాద సమయంలో కారులో నటుడు, ఆయన సోదరుడు, మేనేజర్ అనీస్ కూడా ఉన్నారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పోలీస్ వర్గాల ప్రకారం.. “శుక్రవారం ఉదయం షైన్ టామ్ చాకో తన కుటుంబంతో కలిసి తండ్రి సీపీ చాకోకు వైద్య పరీక్షల కోసం త్రిసూర్ నుండి బెంగళూరుకు ప్రయాణించారు. ప్రయాణంలో పాలకొడ్లోని పయ్యూర్ వద్దకు రాగానే, వారు ప్రయాణిస్తున్న కారు ఒక నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీపీ చాకో అక్కడికక్కడే మృతి చెందారు. షైన్, ఆయన సోదరుడు జో జాన్ చాకో, అలాగే కారు నడిపిన నటుడి మేనేజర్ అనీస్ గాయాలతో పాలకొడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. అనంతరం వారిని ధర్మపురి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు’ అని తెలిపారు.