టీడీపీ పొత్తు ఎందుకు వీడిందో క‌నిపెట్టేశారు..!

యురేకా… క‌నిపెట్టేశారు! ఎన్డీయే నుంచి టీడీపీ ఎందుకు బ‌య‌ట‌కి వ‌చ్చేసిందో, భాజ‌పాతో బంధం ఎందుకు తెంచుకుందో ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొత్త కార‌ణాలు క‌నిపెట్టేశారు. కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ర‌హ‌స్య మంత‌నాలు సాగిస్తున్నార‌ని వీర్రాజు ఆరోపించారు. అంతేకాదు, క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. అందుకే భాజ‌పాకి దూర‌మ‌య్యార‌ని ఆరోపించారు. అంతేకాదు, రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచ‌క‌పోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పాతో పొత్తు పెట్టుకుంటే అత్య‌ధిక స్థానాలు అడుగుతుంద‌ని ఎన్డీయే నుంచి చంద్రబాబు బ‌య‌ట‌కి వెళ్లిపోయార‌న్నారు. అంతేనా, 2004లో చంద్ర‌బాబు కార‌ణంగానే వాజ్‌పేయి ప్ర‌భుత్వం ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి వ‌చ్చింద‌నీ, ఆ ర‌కంగా కాంగ్రెస్ అధికారంలోకి రావ‌డానికి కార‌కుల‌య్యార‌ని అన్నారు. కాంగ్రెస్ ప‌దేళ్ల పాల‌న‌కు చంద్ర‌బాబు కార‌ణ‌మ‌న్నారు.

వీర్రాజు చెప్పిన కార‌ణాల‌ను ఒక్కోటిగా చూద్దాం..! కాంగ్రెస్ తో టీడీపీ ర‌హ‌స్య ఒప్పందం సాధ్య‌మా..? తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ పై ఉన్న వ్య‌తిరేక‌త నుంచి. పైగా, ప్ర‌స్తుతం రాష్ట్రానికి ఇన్ని క‌ష్టాల‌కు కార‌ణం… కాంగ్రెస్ పార్టీ చేసిన అసంబ‌ద్ధ రాష్ట్ర విభ‌జ‌న‌. ఫ‌లిత‌మే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కి ఏపీలో నామ‌రూపాల్లేకుండా పోయింది. అలాంటి పార్టీతో టీడీపీ ర‌హ‌స్య మంత‌నాలు సాధ్య‌మా..? అలాంటి ప‌నులు చేస్తే టీడీపీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం కాదా..? వీర్రాజు చెప్పిన‌ట్టు… క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ విజ‌యానికి చంద్ర‌బాబు ఎలా కృషి చేస్తారండీ..? అంటే, అక్క‌డ భాజ‌పా ఓట‌మికి కార‌ణం టీడీపీ అనే వాద‌న ఇప్ప‌ట్నుంచీ రెడీ చేసుకుంటే… భ‌విష్య‌త్తులో ఏపీలో మ‌రోలా ప్ర‌చారానికి ప‌నికొస్తుంద‌ని అనుకుంటున్నారేమో మ‌రి..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పా ఎక్కువ సీట్లు అడుగుతుంద‌ని చంద్ర‌బాబు పొత్తు తెంచుకున్నార‌ట‌..! వాస్త‌వం మాట్లాడుకుంటే, ఏపీలో భాజ‌పాకి పొత్తు అవ‌స‌ర‌మా.. టీడీపీకి అవ‌స‌ర‌మా..? అలాంట‌ప్పుడు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించే నిర్ణ‌యాధికారం ఏ పార్టీకి ఉంటుంది..? భాజ‌పా ఎన్ని స్థానాలు కోరితే అన్నీ ఇచ్చేయ‌డానికి ఏపీలో ఏ పార్టీ సిద్ధంగా ఉండ‌దు. ఎందుకంటే, ఇక్క‌డ భాజ‌పాకి స్థాన‌బ‌లిమి ఎక్క‌డుంది..? వాస్తవం మాట్లాడుకుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పాతో పొత్తు పెట్టుకునే ధైర్యం ఏ పార్టీ చెయ్య‌దు. ఎందుకంటే, ప్ర‌స్తుతం ఆ పార్టీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. కాంగ్రెస్ తో టీడీపీ మిలాక‌త్ అనే కొత్త వాద‌న‌ను నెమ్మ‌దిగా ప్ర‌జ‌ల్లోకి ఇంజెక్ట్ చేయ‌మ‌నే స‌ల‌హా సోము వీర్రాజు ఎవ‌రిచ్చారోగానీ… ఇది వ‌ర్కౌట్ కాదండి. కర్ణాట‌క‌లో ఓడిపోతే… దాని ద్వారా ఆంధ్రాలో ల‌బ్ధి పొందాల‌నే ఆలోచ‌న ఏదో ఎవ‌రికో త‌ట్టి ఉంటుంది. అందుకే, వీర్రాజు ఇలా మాట్లాడుతున్న‌ట్టున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.