ఆస‌క్తి కోల్పోవ‌డం ఆయ‌న‌కి ఓ అల‌వాటే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరుపై మ‌రోసారి చ‌ర్చకు తెర లేచింద‌నే చెప్పాలి! ఎందుకంటే, కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల లెక్క‌లు తేల్చేస్తా అంటూ ఒక నిజ నిర్ధార‌ణ క‌మిటీని వేశారు. కేంద్రం నుంచి ఆంధ్రాకి రావాల్సిన నిధులెంత అనేది ఆ క‌మిటీ ఒక లెక్క తేల్చి ప‌వ‌న్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, తేల్చిన లెక్క‌తో ఎలా ముందుకెళ్లాల‌నేది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎటూ తేల్చుకోలేక‌పోయారు..! జె.ఎఫ్‌.సి. ఇచ్చిన నివేదిక‌పై మొద‌ట్లో ప‌వ‌న్ బాగానే క‌స‌ర‌త్తు చేశార‌నీ, ఆ త‌రువాత ఆస‌క్తి కోల్పోయార‌ని లోక్ స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. నిజానికి, ఒక అంశంపై మొద‌ట్లో చూపించినంత చొర‌వా, ప్రారంభంలో క‌నిపించిన ఉత్సాహం, ప్రెస్ మీట్ల‌లో క‌నిపించే ఉద్వేగం.. చివ‌రివ‌ర‌కూ ప‌వ‌న్ లో ఉండ‌ద‌నేది ఆయ‌న ట్రాక్ రికార్డ్ త‌ర‌చి చూస్తే ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రు..!

ప్రస్తుతం ఆయ‌న చేస్తానంటున్న ప్ర‌త్యేక హోదా పోరాటం విష‌య‌మే తీసుకుంటే… 2016 ఆగ‌స్టులో ఏమ‌న్నారూ, మూడు ద‌శ‌ల్లో త‌న పోరాటం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. మొదటి దశలో ప్రతీ మండలానికీ వెళ్లి, జరిగిన అన్యాయం ప్రజలకు వివరించి, జరగాల్సిన న్యాయం కోసం జనసేన ఏం చేస్తుందో చెబుతామ‌న్నారు. రెండో ద‌శ‌లో అన్ని పార్టీల ఎంపీలూ, రాష్ట్ర ప్ర‌భుత్వం ఒత్తిడి పెంచుట‌. మూడో ద‌శ ప్ర‌జ‌ల స‌హ‌కారంతో రోడ్ల‌పైకి వ‌చ్చుట‌! ఇంకేముంది ప‌వ‌న్ ముప్పెట దాడి మొద‌లుపెట్టేశారు అనుకున్నాం! ఆ త‌రువాత‌, ఎక్క‌డ ఆస‌క్తి కోల్పోయారో తెలీదుగానీ… ఆ పోరాటం ఎక్క‌డ మొద‌లైందో, ఏ ద‌శ ద‌గ్గ‌ర ఆగిపోయిందో ఆయ‌న‌కి కూడా గుర్తుందో లేదో అనుమానం..!

అదొక్క‌టే కాదు… ప్ర‌త్యేక‌ ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూలు అన్నారు. ఆ త‌రువాత‌, దానిపై ఆస‌క్తి కోల్పోయిన‌ట్టున్నారు, మాట్లాడ‌టం మానేశారు! ద‌క్షిణ భార‌తానికి అన్యాయం జ‌రుగుతోంది, చెన్నైలో స‌భ పెడ‌తా, అంద‌ర్నీ ఆలోచింప‌జేస్తా అన్నారు.. ఆస‌క్తి కోల్పోయారేమో, ఆ స‌భ జ‌ర‌గ‌లేదు! జల్లికట్టు స్ఫూర్తితో విశాఖ ఆర్కే బీచ్ లో హోదా కోసం పోరాటం… ప్రకటనకే పరిమితం. ఆచరణలో ఆసక్తి కోల్పోయారు. ఏపీ స‌ర్కారు భూసేక‌ర‌ణ చేప‌డితే చూస్తూ ఊరుకోన‌ని ఆగ్రంచారు. ఆ త‌రువాత, ప్ర‌భుత్వం నోటిఫికెష‌న్లు ఇచ్చాక స్పందించ‌డం మానేశారు. అంటే, ఆస‌క్తి కోల్పోయారు. తెలంగాణ, ఆంధ్రాలో యాత్ర చేసి, స‌మ‌స్య‌ల‌పై అధ్య‌యనం చేసి, ఎన్నికల్లో జనసేన ప్రయాణానికి బాటలు వేసేస్తా అన్నారు. ఓ నాలుగు రోజులు హ‌డావుడి చేశారు. ఆ త‌రువాత‌, ఏమైందో ఎవ్వరికీ తెలీదు..! ఇలా ఒక‌ట‌నేంటి… చెబుతూపోతే.. ప‌వ‌న్ చేయాల‌ని అనుకున్న‌వీ, ఆ త‌రువాత ఆయనకి ఆస‌క్తి పోయి మ‌రుగున ప‌డిపోయిన‌వీ చాలా అంశాలే ఉన్నాయి. ఇప్పుడు వామ ప‌క్షాల‌తో క‌లిసి హోదా పోరాటం అంటున్నారు. ఈ ప్ర‌స్తుత ఆస‌క్తి అయినా కోల్పోకుండా ఉంటారో లేదో..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.