శివరాత్రి రోజున పాకిస్థాన్ కు కాళరాత్రిలాంటి అనుభవం ఇస్తూ.. ఐసీసీ ట్రోఫీల్లో పాకిస్థాన్ పై భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది, ఈ రోజు కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో చిరకాల ప్రత్యర్థిని భారత్ చిత్తు చేసింది. భారత్ తో ఆడేది లేదని మేకపోతు గాంభీర్యాలు పలికిన పాక్‌ని.. గ్రౌండ్ లోనే బుద్ది చెప్పింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 175 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేసింది. టీమ్ ఇండియా తరపున ఇషాన్ కిషన్ (77) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్య కుమార్ యాదవ్ (32), దూబే (27) తగిన సహకారం అందించారు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన పాక్ ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేక 114 పరుగులకే చతికిలపడింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన పాక్… ఆ తరవాత ఏ ఓవర్లోనూ భారత్ నిర్దేశించిన రన్ రేట్ కు దగ్గరగా రాలేకపోయింది. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, అక్షర్, వరుణ్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.
పాక్ లో ఉస్మాన్ ఖాన్ ఒక్కడే.. 44 పరుగులతో రాణించాడు. మిగిలిన బ్యాటర్లు క్రీజ్‌లో నిలవడానికే ఆపసోపాలు పడ్డారు. ఈ విజయంతో గ్రూప్ ఏలో భారత్ టాప్ గా నిలిచి సూపర్ 8కి అర్హత సాధించింది.
టాస్ సందర్భంగా ఇరు దేశాల కెప్లెన్లు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు. మ్యాచ్ అనంతరం కూడా.. కరచాలనాలు చేసుకోలేదు. ఈ ఓటమితో ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ 8-1 ఆధిక్యం సాధించినట్టైంది. ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు 9 సార్లు తలపడ్డాయి. భారత్ ఏకంగా 8 సార్లు విజేతగా నిలిచింది.
