టీడీపీని వదిలి వెళ్తూ వారు ఇస్తున్న‌ సందేశం ఇదే..!

సాక్షాత్తూ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నా… తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి రోజురోజుకీ మ‌రింత ప‌త‌నావ‌స్థ‌వైపే అడుగులేస్తోంది! ఇక‌పై, తానే పార్టీ వ్య‌వ‌హారాలు చూసుకుంటానూ, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్ కు వ‌స్తానూ, కుటుంబ స‌భ్యులకంటే పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌ ఇస్తానూ.. అని చెప్పినా కూడా, మిగిలిన కేడ‌ర్ లో న‌మ్మ‌కం రోజురోజుకూ స‌న్న‌గిల్లుతోంద‌నే చెప్పాలి. నిజానికి, రేవంత్ రెడ్డి వెళ్లిన ద‌గ్గ‌ర్నుంచే అర‌కొర‌గా మిగిలిన ఉన్న టీడీపీ ద్వితీయ శ్రేణిలో కొంత అభ‌ద్ర‌తా భావం పెరిగింది. రాజ‌కీయ భ‌విష్య‌త్తు కావాలంటే తెలుగుదేశం నుంచి బ‌య‌ట‌కి రావాల‌నే ఒక అనివార్య‌త ఏర్ప‌డిన‌ట్టుగా క‌నిపిస్తోంది. అంతేకాదు, పార్టీ వీడి వెళ్తున్న ప్ర‌ముఖులు కూడా మిగిలిన‌వారికి దాదాపు అవే సంకేతాలు ఇచ్చి వెళ్లిపోతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌రి, దీన్ని టీడీపీ అధినాయ‌క‌త్వం ఎలా అర్థం చేసుకుంటోందో అనేది వారికే తెలియాలి..!

తాజాగా, టీడీపీ సీనియ‌ర్ నేత ఉమా మాధ‌వ‌రెడ్డి కూడా టీడీపీని వీడిన సంగ‌తి తెలిసిందే. త‌న కుమారుడు సందీప్ రెడ్డితో క‌లిసి ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్టు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుకి ఒక లేఖ రాశారు. పార్టీ ఇచ్చిన ప‌ద‌వుల‌కు కూడా రాజీనామా చేశారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసేందుకు త‌న భ‌ర్త ఎంతో కృషి చేశార‌నీ, ఎన్టీఆర్ హ‌యాంలో రెండుసార్లు మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించార‌ని ఈ లేఖ‌లో ఆమె పేర్కొన్నారు. మాధ‌వ‌రెడ్డి మ‌ర‌ణం త‌రువాత స‌హృద‌యంతో త‌న‌కూ క్యాబినెట్ లో ప‌ద‌వితోపాటు, పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ త‌రువాత పార్టీలో అంత‌ర్గ‌తంగా బ‌హిర్గ‌తంగా ఎన్నో ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌నీ, ఈ నేప‌థ్యంలో పార్టీకి రాజీనామా చేస్తున్నాన‌నీ, బాధ‌తోనే ఇలా చేయాల్సి వ‌స్తోంద‌నీ, స‌హృద‌యంతో త‌న రాజీనామా ఆమోదించాలంటూ చంద్ర‌బాబును ఈ లేఖ ద్వారా ఉమా మాధ‌వరెడ్డి కోరారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల ప్రభావం త‌న‌ను పార్టీకి దూర‌మ‌య్యేందుకు ప్రేరేపించాయి అన్న‌ట్టుగా ఆమె పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి పార్టీ కూడా వీడిన‌ప్పుడు దాదాపు ఇలానే చెప్పారు. తెలుగుదేశం పార్టీపై ఎలాంటి నింద‌లూ వేయ‌కుండా, చంద్రబాబుపై ఎలాంటి దూషణలకూ దిగకుండా, పార్టీకి దూరమౌతున్నందుకు బాధగా ఉంద‌ని చెబూతూ వెళ్లిపోయారు! నిజానికి, ఒక నాయ‌కుడు ఒక పార్టీ నుంచి బ‌య‌ట‌కి వెళ్తున్న‌ప్పుడు… ఆ పార్టీ అధినాయ‌క‌త్వంపై కోపంతోనో, విసుగుతోనే వెళ్తే ఆ లెక్క వేరు. ఆ నేత దూర‌మైన ప్ర‌భావం స‌ద‌రు పార్టీలో ఇత‌ర నేత‌ల‌పైనా, కేడ‌ర్ పైనా అంత‌గా ఉండ‌దు. కానీ, ఇలా అత్యంత బాధాక‌ర‌మైన పరిస్థితుల్లో పార్టీకి దూరం కావాల్సి వ‌స్తోంద‌ని చెబుతూ వెళ్తే… ఆ ప్ర‌భావం క‌చ్చితంగా పార్టీపై ప‌డుతుంది. మొన్న రేవంత్ రెడ్డిగానీ, ఇప్పుడు ఉమా మాధ‌వ‌రెడ్డిగానీ దూరం కావ‌డానికి గ‌ల అస‌లు కార‌ణ‌మేంటీ… పార్టీలో ఉంటే తమకు భ‌విష్య‌త్తు లేద‌నే క‌దా! వెళ్తూ వెళ్తూ చంద్ర‌బాబుకు రాసిన లేఖ ద్వారా టీడీపీలో మిగిలి ఉన్నవారికి ఈ ప్ర‌ముఖులు వ‌దిలి వెళ్తున్న సందేశం ఇదే క‌దా. ఈ ప్ర‌భావాన్ని త‌ట్టుకుని, పార్టీని బ‌లోపేతం చేసేందుకు టీడీపీ అధినాయ‌త్వం ద‌గ్గ‌ర ఉన్న వ్యూహం ఏంట‌నేదే ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.