అన్ని అంశాల‌ స‌మ‌న్వ‌యంతో టీడీపీ పోరాటం..!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. దీంట్లో రాష్ట్ర రాజ‌కీయాల‌తోపాటు, క‌ర్ణాట‌క ఎన్నిక‌లు, కేంద్రంపై పోరాటానికి అనుస‌రించాల్సిన వ్యూహంపై కూడా చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి సంబంధించిన వివ‌రాల‌ను మంత్రి కాల్వ శ్రీ‌నివాస్ మీడియాకి వివ‌రించారు. అభివృద్ధిని మ‌రింత వేగంగా కొన‌సాగిస్తూ కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాల‌నేది ఈ స‌మావేశంలో ప్ర‌ధానాంశం అన్నారు. అభివృద్ధి, కేంద్రంపై పోరాటం, రాష్ట్ర హ‌క్కుల సాధ‌న‌, కేంద్రంలోని పెద్ద‌ల స‌హ‌కారంతో రాష్ట్రంలో జ‌రుగుతున్న కుట్ర రాజ‌కీయాల‌పై రాజీలేని పోరాటం చేయాల‌ని స‌మ‌న్వ‌య క‌మిటీ సమావేశంలో నిర్ణ‌యించామ‌న్నారు.

ముందుగా చెప్పుకున్న‌ట్టుగానే, ధ‌ర్మ‌పోరాట రెండో స‌భ‌ను విశాఖలో జ‌రుపుతారు. ఇలా అన్ని జిల్లాల్లోనూ స‌భ‌లు ఏర్పాటు చేసి, చివ‌రిది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో అమ‌రావ‌తిలో జ‌ర‌పాల‌ని సమావేశంలో నిర్ణ‌యించారు. తిరుప‌తి స‌భ జ‌రుగుతుంటే… అదే రోజున విశాఖప‌ట్నంలో వంచ‌న దినాన్ని వైకాపా జ‌ర‌ప‌డం వెన‌క అజెండా ఏంటని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. హోదా ఇవ్వాల్సిన భాజ‌పాపై పోరాడ‌కుండా, టీడీపీపై విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతున్నారంటే దీని వెన‌క ఉన్న కుట్ర ఏంటో అర్థం చేసుకోవాల‌న్నారు. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై ఈడీ అటాచ్ మెంట్లు స‌వ‌రిస్తున్నార‌నీ, గాలి జ‌నార్థ‌న్ రెడ్డిపై ఉన్న మైనింగ్ కేసులు తొల‌గించే ప్ర‌య‌త్నం చేస్తూ, అవినీతిపై పోరాటం అని భాజ‌పా చెప్పుకోవ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అన్నారు. ఇదే సంద‌ర్భంలో పార్టీ నేత‌ల‌కు సీఎం సున్నితంగా క్లాస్ తీసుకున్నారు. నాయ‌కుల చ‌ర్య‌లను ప్ర‌జ‌లు నిత్యం గ‌మ‌నిస్తూనే ఉంటార‌నీ, ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు అర్హులైన‌వారంద‌రికీ ఫ‌లాలు అందేలా చూడాల‌ని సూచించారు.

అభివృద్ధి, హ‌క్కుల సాధ‌న‌, కుట్ర రాజ‌కీయాలు… మూడింటినీ స‌మ‌న్వ‌యం చేసుకుంటూ పోరాటం చేస్తామ‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించుకున్నారు. నిజానికి ఈ మూడూ ఒకే అంశం చుట్టూ తిరుగుతున్న‌వే. అభివృద్ధి జ‌ర‌గాల‌న్నా కేంద్ర‌మే నిధులు ఇవ్వాలి, హ‌క్కులు ప్ర‌కారం ప్ర‌యోజ‌నాలు ఇవ్వాల‌న్నా కేంద్ర‌మే ఇవ్వాలి, కుట్ర రాజ‌కీయాల‌ను అడ్డుకోవాల‌న్నా… కేంద్రం మ‌ద్ద‌తులో సాగుతున్న రాజ‌కీయాల‌ను అడ్డుకోవాలి. ఈ మూడూ స‌మ‌న్వ‌యం అంటే క‌ష్ట‌సాధ్య‌మైన అంశ‌మే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.