తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ప్రారంభమయింది. ఒకప్పుడు సమ్మె అంటే ప్రభుత్వం భయపడే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు కాలం మారింది. ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే భారీ నష్టాల్లో ఉంటూ, ప్రైవేటు రవాణా వ్యవస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సమ్మె అనే ఆలోచన చేయడం సంస్థ ఉనికికే ప్రమాదకరంగా మారుతుంది. గతంలో జరిగిన సంఘటనలను విస్మరించి, ఉద్యోగ సంఘ నేతలు మళ్లీ అదే దారిలో వెళ్లడం కార్మికుల భవితవ్యాన్ని పణంగా పెట్టడమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేసీఆర్ హయాం నాటి చేదు జ్ఞాపకాలు
2019లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన 52 రోజుల సమ్మె ఆర్టీసీ చరిత్రలో ఒక మాయని మచ్చ. అప్పట్లో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించి, దాదాపు 48 వేల మంది కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అయినట్లు ప్రకటించింది. ఆ సమయంలో వేతనాలు అందక, ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియని మానసిక ఒత్తిడితో దాదాపు 30 మందికి పైగా కార్మికులు గుండెపోటుతోనో, ఆత్మహత్యలతోనో ప్రాణాలు కోల్పోయారు. చివరకు ఎటువంటి హామీలు నెరవేరకుండానే, బతుకు జీవుడా అంటూ కార్మికులు తిరిగి విధుల్లో చేరాల్సి వచ్చింది. ఆనాడు కార్మిక నేతలు చేసిన వ్యూహాత్మక తప్పిదాల వల్ల సామాన్య ఉద్యోగులు బలిపశువులయ్యారు.
రేవంత్ సర్కార్ అదే కఠినత్వం చూపితే ..
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆర్టీసీ విషయంలో గట్టిగానే ఉంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతోంది. ఇలాంటి సమయంలో డిమాండ్ల పేరుతో విధులకు ఆటంకం కలిగిస్తే ప్రభుత్వం కూడా కేసీఆర్ తరహాలోనే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్మా ప్రయోగించే దిశగా అడుగులు పడితే, కార్మికుల పరిస్థితి మళ్లీ మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యలను, సమ్మె ద్వారా సాధించాలనుకోవడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అసాధ్యంగా కనిపిస్తోంది.
కార్మిక నేతల బాధ్యతారాహిత్యం – మోసపోతున్న కార్మికులు
ఉద్యోగ సంఘ నేతలు తమ రాజకీయ ఉనికి కోసం లేదా వ్యక్తిగత ప్రాబల్యం కోసం కార్మికులను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణమైన నాయకులు, ఇప్పుడు మళ్లీ వారినే రోడ్డుపైకి లాగడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభుత్వం దిగిరాకపోతే నష్టపోయేది కార్మికులే తప్ప నేతలు కాదు. ప్రజలకు రవాణా సౌకర్యం నిలిచిపోతే వచ్చే ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం సాకుగా తీసుకుని సంస్థను మరింత ప్రైవేటీకరణ చేసే ప్రమాదం పొంచి ఉంది.
