జగిత్యాల సభ విజయవంతం చేయాలని జన సమీకరణ విషయంలో గట్టిగా ప్రయత్నించిన కేటీఆర్ చివరికి సభకు హాజరు కాలేదు. సభ తర్వాత పరిమామాలపై స్పందించడం లేదు. అందుకే కేటీఆర్ మౌనం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్ ఏడాదిన్నర తర్వాత నిర్వహించిన సభలో కేటీఆర్ మెరవకపోవడం, కనీసం ఆ సభ విజయవంతంపై సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిన్నటి వరకు ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడిన ఆయన, గత కొద్దిరోజులుగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడం వెనుక ఏదో జరుగుతోంది అనే చర్చ సాగుతోంది.
రేవంత్ విమర్శలపై వ్యూహాత్మక మౌనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా, గతంలో లాగా కౌంటర్ అటాక్ కనిపించడం లేదు. సాధారణంగా రేవంత్ రెడ్డి వేసే ప్రతి విమర్శకు గంటల వ్యవధిలోనే ప్రెస్ మీట్ పెట్టి ధీటైన సమాధానం ఇచ్చే కేటీఆర్, ఇప్పుడు అసలు స్పందించకపోవడం కేడర్‌ను అయోమయానికి గురిచేస్తోంది. ఇది ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసేందుకు అనుసరిస్తున్న సైలెంట్ స్ట్రాటజీ అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలే దీనికి కారణమని విశ్లేషిస్తున్నారు.
ముగ్గురు నేతలు.. మూడు దారులు?
బీఆర్ఎస్ భవిష్యత్తు , పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఒకరు దూకుడుగా వెళ్లాలని భావిస్తుంటే, మరొకరు వేచి చూసే ధోరణి అవలంబించాలని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు అగ్రనేతల మధ్య వ్యూహాత్మక భేదాలు తలెత్తడం వల్లే, ఒకరు యాక్టివ్‌గా ఉన్నప్పుడు మరొకరు మ్యూట్‌లోకి వెళ్తున్నారనే చర్చ రాజకీయ గల్లీల్లో జోరందుకుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ ముగ్గురూ కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటున్న తరుణంలో, ఇలాంటి మౌన వ్రతాలు ఇ్బందికరంగా మారాయి.
కేసీఆర్ స్ట్రాటజీ కేటీఆర్‌కు వర్కవుట్ అవదు!
కేసీఆర్ గతంలో పాటించిన మౌన ముని వ్యూహాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నారా.. లేక నిజంగానే పార్టీలో నాయకత్వ బాధ్యతలు లేదా ప్రాధాన్యత విషయంలో ఏమైనా అలకలు ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. కీలకమైన విషయాల్లో కేటీఆర్ ఇలా తన అసంతృప్తిని బహిరంగంగా తెలిపే అవకాశం ఉండదు. కానీ తెలిసేలా చేస్తున్నారంటే.. ఖచ్చితంగా పెద్ద ఇష్యూనే అయి ఉంటుందని అనుకోవచ్చు. ఫ్యామిలీ రాజకీయాలు.. కుటుంబానికే పరిమితం చేసుకోవాలని..బయటకు రానివ్వొద్దని.. అలాంటి సూచనలు వచ్చినా నష్టమేనని క్యాడర్ ఆందోళన చెందుతున్నారు.
