వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల దీక్షలు, పర్యటనలు ఒక వింత గణితం. మంగళవారం సాయంత్రం బెంగళూరు నుంచి పులివెందులకు ల్యాండ్ అవ్వడం, గురువారం ఉదయాన్నే మళ్ళీ రిటర్న్ అవడం .. దీనికి మూడు రోజుల పర్యటన అని భారీ నామకరణం చేయడం వైసీపీకే సాధ్యం. సాధారణంగా ఎవరైనా పర్యటన అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల మధ్య గడపడం అనుకుంటారు. కానీ, ఇక్కడ లెక్క వేరు. సాయంత్రం వచ్చి నిద్రపోతే ఒక రోజు, మరుసటి రోజు ఉదయం పలకరించి పరామర్శిస్తే రెండో రోజు, ఇక మూడో రోజు ఉదయం టిఫిన్ చేసి బయలుదేరితే అది మూడో రోజు కింద లెక్క.
లండన్ వెళ్లే ముందు.. పులివెందుల టచ్ అండ్ గో
ఇరవై రోజుల పాటు లండన్లో వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి కోర్టు అనుమతి వచ్చేసింది. తన కుమార్తెలను చూడటానికి వెళ్లే ముందు, సొంత నియోజకవర్గ ప్రజలను కలిశానని ఒక మార్కు వేయించుకోవాలనేది జగన్ మాస్టర్ ప్లాన్. మంగళవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు సాగే ఈ పర్యటనలో బుధవారం ఒక్కరోజే అసలైన హడావుడి. ఉదయం ఒక నేత కుటుంబాన్ని పరామర్శించి, మధ్యాహ్నం రెండు గంటల పాటు ప్రజాదర్బార్ పేరుతో ఫోటోలకు ఫోజులిస్తే డ్యూటీ అయిపోయినట్లే. ప్రజల సమస్యల పరిష్కారం కంటే, తాను ప్రజల మధ్య ఉన్నట్లు సాక్షిలో కలర్ ఫుల్ ఫోటోలు రావడమే ఈ టూర్ ముఖ్య ఉద్దేశం.
దీక్షల నుంచి పర్యటనల వరకు.. అంతా గంటల వింతే!
గతంలో జగన్ చేసిన దీక్షల లెక్కలు కూడా ఇలాగే గమ్మత్తుగా ఉండేవి. మధ్యాహ్నం రెండు గంటలకు దీక్ష మొదలుపెట్టి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకే నిమ్మరసం తాగేసి, రెండు రోజుల దీక్ష విజయవంతం అని ప్రకటించుకున్న చరిత్ర ఆయనది. ఇప్పుడు పులివెందుల పర్యటన కూడా అదే బాటలో సాగుతోంది. రాజకీయాల్లో సీరియస్ నెస్ అంటే సమస్యల మీద పోరాడటం అనుకుంటే తప్పు.. జగన్ భాషలో అది కేవలం సెలవులకు ముందు చేసే ఒక రివర్స్ టూర్ మాత్రమే. ఇలాంటి షార్ట్ కట్ పర్యటనలు చూసి సామాన్య కార్యకర్తలు కూడా అన్నా.. అప్పుడే వచ్చేసి, అప్పుడే వెళ్ళిపోతే ఇక పర్యటన ఎప్పుడు అని ముక్కున వేలేసుకుంటున్నారు.
నాన్ సీరియస్ పాలిటిక్స్
పులివెందుల ఎమ్మెల్యేగా తప్ప ఏ ఇతర అధికారిక హోదా లేని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయని ఆయన తమ తో అయినా ఉంటారని పులివెందులలో ప్రజలు ఎదురుచూస్తుంటే, ఆయన మాత్రం లండన్ వీధుల్లో తిరిగే ప్లాన్లతో బిజీగా ఉన్నారు. సీరియస్ లీడర్ అంటే ప్రజాక్షేత్రంలో పోరాడేవాడు కావాలి కానీ, కేవలం సెలవుల కోసం కోర్టు చుట్టూ, సెల్ఫీల కోసం క్యాంప్ ఆఫీసు చుట్టూ తిరిగేవాడు కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. అయినా ఇలాంటివి చాలా చూశాంలే అని వైసీపీ అధినేత లైట్ తీసుకుంటున్నారు.
