టాలీవుడ్ లో డూప్ ల గురించి చర్చ విపరీతంగా నడుస్తోంది. ఏ హీరోకి ఎవరు డూప్ గా నటిస్తున్నారన్న విషయంలో ఫ్యాన్స్ కి ఓ అవగాహన ఉంది. కొంతమంది డూప్ లతో సోషల్ మీడియా పేజీలు రన్ అవుతున్నాయి. హీరోలు డూప్లపై మరీ అతిగా ఆధారపడుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది హీరోలు ఓ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. తమ సినిమాల్లో డూప్ ని మరీ అవసరమైతే తప్ప, వాడకూడదని భావిస్తున్నార్ట. ఓ విధంగా ఇది మంచి నిర్ణయం మరో విధంగా రిస్కు కూడా.
ఇప్పుడు ఏది డూప్ షాటో, ఏది వీఎఫ్ఎక్స్ షాటో ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. సినిమాల్లో హీరోలు దొరక్కపోయినా ఓటీటీలో దొరికేస్తున్నారు. తీరిగ్గా ఇంట్లో సినిమా చూస్తూ, స్లో మోషన్ లో డూప్ లను పట్టేస్తున్నారు. అందుకే వాళ్లకు దొరకడం, ఇలా ట్రోల్ అవ్వడం హీరోలకు కూడా ఇష్టం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకూ డూప్స్ ని పక్కన పెడుతున్నారు.
కొన్నిసార్లు నిర్మాతలే హీరోల్ని ‘ఇది రిస్కీ షాట్. కాబట్టి మీ డూప్ వాడతాం..’ అని బతిమాలుకోవాల్సివస్తోంది. హీరోలతో వందల కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు రిస్క్ ఎక్కువైనప్పుడు ఇలా ఆలోచించడం, పెరిగిన టెక్నాలజీని వాడుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. హీరోలకు పొరపాటున దెబ్బ తగిలితే, షూటింగులు ఆగిపోతాయి. దాంతో చాలామంది జీవితాలపై ప్రభావం పడుతుంది. డూప్లైతే.. అన్ని విషయాల్లోనూ శిక్షణ తీసుకొని ఉంటారు. కాబట్టి.. రిస్కీ షాట్స్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ. ఈమధ్య హీరోలకు సెట్ లో గాయాలు అవ్వడం, వాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సిరావడం, తద్వారా షూటింగులు ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి రిస్కులు ఉంటాయి కాబట్టే డూప్స్ తో సర్దుకుపోవడానికి నిర్మాతలు, దర్శకులు సిద్ధంగానే ఉంటారు.
కానీ రిస్కీ ఫైట్స్ విషయంలో హీరోల అభిప్రాయాలు మారుతున్నాయి. ఫ్యాన్స్ కి అసలైన వినోదాన్ని అందివ్వడానికే హీరోలు ఇష్టపడుతున్నారు. ‘ఇది డూప్’ అని ఫ్యాన్స్ తో వేలెత్తి చూపించుకోకుండా నూటికి 90 శాతం వర్జినల్ ఫుటేజీ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నారు. అభిమానులు కూడా టికెట్ కొనేది తమ హీరోల్ని వెండి తెరపై కళ్లారా చూసుకోవడానికే. అంత తప్ప వాళ్ల డూప్ ల కోసం కాదు. ఈ నిజాన్ని హీరోలు గ్రహించి, డూప్ లకు బై చెబుతున్నారు. ఓరకంగా ఇది ఆహ్వానించదగిన పరిణామమే. కాకపోతే రిస్కీ షాట్లు తీసుకొనేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువ రిస్క్ అనుకొంటే అప్పుడు వీఎఫ్ ఎక్స్, ఏఐ ఎలానూ ఉంది. ఏదేమైనా హీరోల నిర్ణయం వల్ల వాళ్లకు రిస్క్ ఎక్కువైనా… ఇక నుంచి డూప్ ల విషయంలో యాంటీ ఫ్యాన్స్ హీరోల్ని ట్రోల్ చేయడం తగ్గుతుంది.
