ప్రతీ సంక్రాంతికీ బాక్సాఫీసు దగ్గర బీభత్సాలే కనిపిస్తాయి. ఒకేసారి సినిమాలన్నీ గుంపుగా రావడంతో కొత్త కళ సంతరించుకొంటుంది. ఈసారి ఏకంగా 5 సినిమాలు వస్తున్నాయి. చిరు, ప్రభాస్, రవితేజ లాంటి స్టార్లు.. శర్వానంద్, నవీన్ పొలిశెట్టి లాంటి యంగ్ హీరోలు ఈ పండగ బరిలో ఉన్నారు. ఈ సినిమాలకు సంబంధించి ప్రతీ రోజూ ఏదో ఓ అప్ డేట్ బయటకు వస్తోంది. ఏదో ఓ ఈవెంట్ జరుగుతోంది. అయితే.. ఎందుకో, ప్రమోషన్స్ లో ఇది వరకటి ఊపు కనిపించడం లేదన్నది ఫ్యాన్స్ మాట. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ సంక్రాంతి హీరోలు దాదాపుగా మీడియా ఇంట్రాక్షన్స్ లో పాలు పంచుకోవడానికి ఇష్టపడడం లేదు.
‘రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవ్వగానే.. ప్రభాస్ ఫారెన్ వెళ్లిపోయాడు. ఆయనతో మీడియా ఇంట్రాక్షన్స్ లేవు. ప్రెస్ మీట్లకు రావడం, ప్రమోషన్స్ చేయడం ఇవేం ప్రభాస్ కి పెద్దగా నచ్చవు. ఇంటర్వ్యూలు అనేది పెద్ద పని. రవితేజదీ ఇదే టైపు. ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడరు. నిన్నటికి నిన్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ లాంచ్ కి వచ్చారు. వచ్చినా రానట్టే వ్యవహరించారు. కనీసం ఫ్యాన్స్ కోసమైనా నాలుగు ముక్కలు మాట్లాడతారు అనుకొంటే అదీ లేదు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకు సంబంధించి రోజూ ఏదో ఓ ఈవెంట్ జరుగుతూనే ఉంది. నిన్నటికి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. కానీ ఈ సినిమా కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది కేవలం… దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. చిరంజీవి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆయన సినిమా రిలీజ్ అయ్యాకే మీడియా ముందుకు వస్తానంటున్నారని టాక్. శర్వానంద్ పరిస్థితీ ఇంతే. తనకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఇప్పుడు మీడియాతో ఇంట్రాక్ట్ అయితే పాత విషయాలు, పాత ఫ్లాపులు తవ్వి తోడతారన్నది భయం. అందుకే ఆయన కూడా రిలీజ్ వరకూ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యార్ట. నిజానికి మిగిలిన సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకే పబ్లిసిటీ కాస్త డల్ గా ఉంది. ఇప్పటి వరకూ ట్రైలర్ కూడా బయటకు రాలేదు. శర్వా కూడా సైలెంట్ అయిపోయాడు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి కానిస్తారంతే. `అనగనగా ఒక రాజు`కు సంబంధించిన ప్రమోషన్స్ బాధ్యత అంతా నెత్తిమీద వేసుకొన్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. అయితే ఆయన కూడా ఇప్పటి వరకూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. బహుశా.. రేపటి నుంచి రంగంలోకి దిగుతారేమో.
చిన్నదో, పెద్దదో ఓ సినిమా విడుదల అవుతోందంటే కనీస స్థాయి ప్రమోషన్లు ఉంటాయి. వీటికీ అలానే జరుగుతోంది తప్ప, ప్రత్యేకమైన హడావుడి లేదు. ఆమాటకొస్తే.. మిగిలిన సినిమాలతో పోలిస్తే కాస్త తక్కువే జరుగుతోంది. కాకపోతే.. సంక్రాంతి సీజన్లో సినిమా రావడం కంటే పెద్ద ప్రమోషన్ ఏముంటుంది? అని దర్శక నిర్మాతలు, హీరోలు భావించి ఉంటారు. అందుకే కాస్త లైట్ తీసుకొంటున్నట్టు కనిపిస్తోంది.
