ఆల‌స్యంగా పంట కోస్తామంటున్న ఆజాద్‌..!

తెలంగాణ ఇచ్చింది మేము, దీన్లో తెరాస పాత్ర ఏమీ లేదు… రాబోయే ఎన్నిక‌ల్లో ఇదే అంశాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌న్న‌ది కాంగ్రెస్ నిర్ణ‌యంగా క‌నిపిస్తోంది! వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ దీన్ని బ‌లంగా వినిపించ‌లేక‌పోయింది. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కేంద్రంలో నాడు బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం, మ‌ద్ద‌తు ప‌లికింది కాంగ్రెస్ స‌భ్యులు! అయిన‌ప్ప‌టికీ ఆ క్రెడిట్ ద‌క్కించుకోవ‌డంలో నాడు విఫ‌ల‌మ‌య్యారు. అదే వాద‌న‌ను ఇప్పుడు మ‌రోసారి వినిపించే ప్ర‌య‌త్నం చేశారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత గులామ్ న‌బీ ఆజాద్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల వ్యూహంపై నేత‌ల‌తో చ‌ర్చించ‌డానికి హైద‌రాబాద్ వ‌చ్చిన ఆజాద్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఏర్పాటులో తెరాస పాత్ర ఏమీ లేద‌న్నారు ఆజాద్‌! కాంగ్రెస్ నేత‌లు పోరాటం చేసి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధిస్తే, స‌రిగ్గా పంట కోసే స‌మ‌యానికి కేసీఆర్ వ‌చ్చార‌నీ, అంతా తానే తెచ్చానంటూ ప్ర‌చారం చేసుకున్నార‌ని ఆజాద్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధ‌న కోసం కాంగ్రెస్ పార్ల‌మెంటు స‌భ్యులు, శాస‌న స‌భ్యులు అరెస్టుల‌య్యార‌న్నారు! కాంగ్రెస్ ఎంపీలే పార్ల‌మెంటును సాగ‌నివ్వ‌లేద‌న్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర కేటాయింపు స‌మ‌యంలో తాము తెరాస‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌న్నారు. ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మౌతున్న డిమాండ్‌, కాంగ్రెస్ నేత‌ల పోరాటాన్ని మాత్ర‌మే ప‌రిగ‌ణించి ప్ర‌త్యేక రాష్ట్రాన్ని నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింద‌ని ఆజాద్ గుర్తు చేశారు.

ఎప్పుడో కోసుకోవాల్సిన పంట గురించి ఆజాద్ ఇప్పుడు మాట్లాడుతున్నారు! నిజానికి, రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణ ఎవ‌రి వ‌ల్ల సాధ్య‌మైంద‌న్న చ‌ర్చ‌కు ప్రాధాన్య‌త ఉంటుందా..? సాధించిన తెలంగాణ‌లో ఆశించిన అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌న్న అంశాన్ని కాంగ్రెస్ బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చెయ్యాలి! ప్ర‌త్యేక రాష్ట్రం ఇస్తే… తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంద‌ని తాము ఇచ్చామ‌నే వాద‌న వినిపిస్తే కొంత ప్ర‌యోజ‌నం ఉంటుంది! అంతేగానీ, తెలంగాణ ఏర్పాటు వెన‌క కేసీఆర్ ప్ర‌మేయ‌మే లేద‌నీ, తెరాస వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌ని వ్యాఖ్యానించ‌డం కాంగ్రెస్ కి ఏర‌కంగా ఉప‌యోగ‌ప‌డ‌దు. తెలంగాణ ఏర్పాటులో తెరాస పాత్ర‌ను ఎవ్వ‌రూ కాద‌న‌లేరు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల ఆ సెంటిమెంట్ అంశాన్ని మ‌రోసారి బ‌లంగా వాడుకునే అస్త్రాన్ని తెరాస‌కి కాంగ్రెస్ అందిస్తున్న‌ట్టుగా ఉంది! తెలంగాణ ఎవ‌రు ఇచ్చార‌న్న అంశం కంటే… ఇచ్చాక‌ అభివృద్ధి ఏం జ‌రిగింద‌నేది కాంగ్రెస్ ప్ర‌శ్న‌గా మార్చుకుంటే కొంత ప్ర‌యోజ‌నం ఉండొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com