సంక్రాంతి సీజన్ అనేది పుష్పక విమానం అయిపోయింది. స్టార్లే కాదు, మీడియం రేంజ్ హీరోలు కూడా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. 2027 సంక్రాంతి బెర్తులు దాదాపు ఫుల్ అయిపోయినట్టే. చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్ర హీరోలు సంక్రాంతిని ముందే టార్గెట్ చేసేశారు. బాలకృష్ణ, నాగార్జున సినిమాలూ సంక్రాంతికే వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శర్వానంద్ సైతం సంక్రాంతికి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నామనే సంకేతాలు పంపాడు.
వరుణ్ కొత్త సినిమా ‘బరి’ ఈరోజే మొదలైంది. నిహారిక నిర్మాత. ‘కమిటీ కుర్రాళ్లు’ తో సక్సెస్ అందుకొన్న యదు వంశీ దర్శకుడు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. వరుణ్ కి ఇప్పుడు సక్సెస్ చాలా అవసరం. కథల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, రిలీజ్ డేట్ విషయంలోనూ అంతే ఓర్పు, నేర్పు అవసరం. సంక్రాంతి సీజన్ హాట్ కేకే. అందులో సందేహం లేదు. కానీ హేమా హేమీలు బరిలో దిగుతున్నప్పుడు ఆ రిస్క్ చేయకపోవడమే మంచిది. పైగా చిరంజీవి సినిమా లైనప్ లో ఉండగా, వరుణ్ రావడం కూడా మెగా ఫ్యాన్స్ కి నచ్చకపోవొచ్చు. చిరంజీవి సినిమా వస్తే తప్పుకొంటాం అని వరుణ్ అండ్ కో.. చెబుతున్నారు. చిరు – బాబీ సినిమా సంక్రాంతికి ఫిక్స్ అని ముందే తెలిసినప్పుడు రిలీజ్ డేట్ ముందే ఎనౌన్స్ చేయడం కూడా ఇబ్బందికరమైన అంశమే.
వాలీబాల్ నేపథ్యంలో సాగే కథ ఇది. వరుణ్ కి చిన్నప్పటి నుంచీ వాలీబాల్ అంటే ఇష్టం. స్కూల్ స్థాయిలో ఆడాడు కూడా. ఇప్పుడు ఈ సినిమా కోసం కొత్తగా ప్రాక్టీస్ కూడా మొదలెట్టాడు.


