‘స్పైడ‌ర్’ పోస్ట‌ర్‌: మానిన గాయాన్ని రేపడ‌మేగా?

మ‌హేష్ బాబు కెరీర్‌లోనే భారీ డిజాస్ట‌ర్ల‌లో ‘స్పైడ‌ర్‌’ ఒక‌టి. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. త‌మిళంలోనూ ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు మ‌హేష్‌. అయితే.. ఈ ప్ర‌య‌త్నం దారుణంగా బెడ‌సికొట్టింది. బాక్సాఫీసు ద‌గ్గ‌ర వ‌సూళ్లు సాధించ‌డంలో విఫ‌ల‌మైన స్పైడ‌ర్‌, విమ‌ర్శ‌ల మ‌న‌సుల్నీ గెలుచుకోలేక‌పోయింది. ఈ సినిమా లోటు పాట్ల‌పై భారీ చ‌ర్చ సాగింది. సోష‌ల్ మీడియాలో సెటైర్లు కూడా బాగానే ప‌డ్డాయి. మ‌హేష్ అభిమానులు కూడా బాగా నొచ్చుకొన్నారు. మా హీరో ఇలాంటి సినిమా చేశాడేంటి? అని బాధ‌ప‌డ్డారు. మెల్ల‌మెల్ల‌గా ఇప్పుడే ఆ ప‌రాభ‌వం నుంచి తేరుకొంటున్నారు ఫ్యాన్స్‌. దానికి తోడు… మ‌హేష్‌బాబు ఖాతాలో మ‌రో నంది అవార్డు చేరింది. శ్రీ‌మంతుడు తో ఉత్త‌మ న‌టుడిగా నంది అవార్డు అందుకోబోతున్నాడు. స్పైడ‌ర్ గుర్తుతులు మ‌ర్చిపోతున్న‌ట్టే అనుకొంటున్న త‌రుణంలో ఆ చిత్ర‌బృందం ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. ’50 రోజులు ఆడేసింది’ అంటూ.

ఆ పోస్ట‌ర్ చూసిన ఫ్యాన్స్‌కి న‌వ్వాలో, ఏడ‌వాలో అర్థం కాని ప‌రిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ అన్న సంగ‌తి స్వ‌యంగా మ‌హేష్ బాబు అభిమానులే ఒప్పుకొంటున్నారు, సినిమా విడుద‌లైన త‌ర‌వాత చిత్ర‌బృందం మీడియా ముందుకు రావ‌డానికి భ‌య‌ప‌డిందంటే – స్పైడ‌ర్ ఏ స్థాయి ఫ్లాపో అర్థం చేసుకోవొచ్చు. స‌రేలే… అంటూ ఆ బాధ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తున్న త‌రుణంలో ఇప్పుడీ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం అవ‌స‌ర‌మా?? మ‌రోసారి నాన్ మ‌హేష్ ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డానికీ, స్పైడ‌ర్‌పై సెటైర్లు వేసుకోవ‌డానికీ త‌ప్ప‌… వేరే ఉప‌యోగం ఏమైనా ఉందా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com