తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన వారికి బీఆర్ఎస్-బీజేపీ పొత్తు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల్లో అధికారం కోసం కొన్ని చోట్ల ఈ రెండు పార్టీలు అనూహ్యంగా చేతులు కలపడం భవిష్యత్తు పొత్తులపై చర్చకు దారితీసింది. రాష్ట్రవ్యాప్త మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించినప్పటికీ, కొన్ని మున్సిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడానికి బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయకారి అవగాహన కుదిరినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి వంటి చోట్ల బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిస్తే, మరికొన్ని చోట్ల బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ పీఠాలను కైవసం చేసుకుంది.
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై చాలా కాలంగా ప్రచారం
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు పొడుస్తుందని చాలా కాలంగా ప్రచారం ఉంది. అసలు విలీనం కోసమే కేటీఆర్ ప్రయత్నించారని సీఎం రమేష్ తో పాటు కవిత కూడా చెప్పారు. దానికి తగ్గట్లుగానే బీజేపీపై బీఆర్ఎస్ పెద్దగా ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. పైపైన విమర్శలు చేస్తున్నారు కానీ ఎప్పుడూ కేంద్రాన్ని టార్గెట్ చేయడం లేదు. పొత్తుల కోసమే… బీజేపీ పెద్దల్ని నొప్పించకుండా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో భిన్నాభిప్రాయాలు
అయితే తెలంగాణ బీజేపీలో బీఆర్ఎస్తో పొత్తు అంశంపై స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని స్పష్టం చేసినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన సానుకూలంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈటల రాజేందర్, బండి సంజయ్ వంటి నేతలు బీఆర్ఎస్ అవినీతిపై పోరాడి ఎదిగిన వారు కావడంతో, వారు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అటు బీఆర్ఎస్ కూడా ఉనికిని చాటుకోవడానికి బీజేపీ సహకారం అవసరమని భావిస్తున్నట్లు కేడర్ సంకేతాలు ఇస్తోంది.
అంతా హైకమాండ్ చేతుల్లోనే !
అసలు ప్రశ్నల్లా బీజేపీ హైకమాండ్ ఆలోచనల చుట్టూనే తిరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ గతంలో బీఆర్ఎస్తో పొత్తుకు ఆస్కారమే లేదు అని కచ్చితంగా చెప్పినప్పటికీ, 2026 నాటి రాజకీయ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ను బలహీనపరచడమా లేక వారితో జతకట్టడమా అనే ద్వంద్వ స్థితిలో కేంద్ర నాయకత్వం ఉంది. ఒకవేళ హైకమాండ్ ఆదేశిస్తే, స్థానిక నేతలు ఇష్టం లేకపోయినా పొత్తుకు అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే రెండు పార్టీల ఓటు బ్యాంకు కలిపి కాంగ్రెస్ను అధిగమించే అవకాశం ఉందని మున్సిపల్ ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ పొత్తు వల్ల మైనారిటీ ఓట్లు , తటస్థ ఓటర్లు పూర్తిగా దూరమవుతారనే ఆందోళన కూడా ఉంది. పొత్తుల గురించి ఫైనల్ కావాలంటే.. ఎన్నికలు రావాల్సి ఉంటుంది.
