శాసనమండలిలో సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీలు దాడికి ప్రయత్నించడం సంచలనం రేపింది. ఈ అంశం బయటకు రాగానే వైసీపీ వణికిపోయింది. వెంటనే.. వైసీపీ ఎమ్మెల్సీలు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ పేరుతో వరుసగా మాట్లాడారు. తాము సోము వీర్రాజుపై దాడి చేయలేదని .. అలాంటి ప్రయత్నం కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. సోము వీర్రాజుపై దూసుకెళ్లినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ అయితే మరింత భయపడిపోయారు.
సోము వీర్రాజు తమ ప్రాంతానికి చెందిన వారని.. ఆయనపై తాను ఎందుకు దాడి చేస్తానని.. ఆయన తండ్రి లాంటి వారని చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ కూడా అదే చెప్పారు. తాము సోము వీర్రాడుపై దాడి చేయలేదన్నారు. ఇంకా హైలెట్ ఏమిటంటే ఎప్పుడూ లేని విధగా మండలి చైర్మన్ మోషేన్ రాజు కూడా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసి.. సోము వీర్రాజుపై దాడి జరగలేదని.. అలాంటి ప్రయత్నం జరగలేదని వివరించారు. సోము వీర్రాజు మంత్రి కాదని.. ఆయన సమాధానం ఇవ్వకూడదని.. ఆయన వెల్ లోకి వచ్చినప్పుడు వైసీపీ సభ్యులు కూడా అక్కడే ఉన్నారని చెప్పారు. అంటే .. సోము వీర్రాజుదే తప్పని చెప్పాలనుకున్నారు.. వైసీపీ సభ్యులు దాడి చేయడానికి ప్రయత్నించలేదని కవర్ చేయడానికి ప్రయత్నించారు.
కానీ సోము వీర్రాజు మాత్రం దాడి చేసేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు యత్నించారని..సభను వాయిదా వేయొద్దని చైర్మన్ కోరేందుకు రెండుసార్లు పోడియం వద్దకు వెళ్లాననని సోము వీర్రాజు తెలిపారు. సభ్యతా సంస్కారాలు లేకుండా నాపై దాడికి యత్నించారు..కల్తీ నెయ్యిపై చర్చ జరగడం ప్రతిపక్షానికి ఇష్టం లేదన్నారు. చర్చ జరిగితే వాస్తవాలు బయటపడతాయని భయపడుతున్నారని విమర్శించారు. సోము వీర్రాజు బీజేపీ ఎమ్మెల్సీ కావడంతో ఆయనపై దాడి అంటే.. ఎక్కడో స్పందన వస్తే తమకు ఇబ్బందేనని ఇలా వైసీపీ ఎమ్మెల్సీలు కవర్ చేసుకునే ప్రయత్నం చేసినట్లుగా భావిస్తున్నారు.