జనసేనపై జగన్ విశ్లేషణ ఇలా ఉంది..!

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించి, మేలు చేస్తార‌నే భ‌రోసా ఏ పార్టీ ఇస్తుందో ఆ పార్టీతో పొత్తుకు సిద్ధ‌మ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీ, వైకాపా… దేనితోనైనా పొత్తు సిద్ధం అన్న‌ట్టుగా ఇటీవలే సంకేతాలు ఇచ్చారు. వైకాపాను ప్రత్యేకంగానో, వైరివర్గంగానో ఆయన చూడటం లేదు. కానీ, జనసేనను జగన్ చూసే తీరు వేరేలా ఉందని అర్థమౌతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును ప‌వ‌న్ చీల్చుతారు అనే లెక్క‌లు కొన్ని ఉన్నాయి కదా. కానీ, జ‌న‌సేన‌ను సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టుగా జ‌గ‌న్ మాట్లాడుతున్నారు. జ‌నసేన కాదు.. ఎన్ని సేన‌లు క‌లిసినా వైకాపాకి వ‌చ్చే ఇబ్బందేమీ లేద‌ని జ‌గ‌న్ విశ్లేషించ‌డం విశేషం..! ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర‌లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌న‌సేన గురించి మాట్లాడారు.

జ‌న‌సేన త‌మ‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌దు అన్నారు. ‘కార‌ణం ఏంటంటే.. ఓట్లు వేయించేవాడు దేవుడు, ఓట్లేసేది ప్ర‌జ‌లు. ఎవ‌రి వ‌ల్ల త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటారో వారికే ఓట్లేస్తారు’ అని చెప్పారు. ఈ జ‌న‌సేన గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్నారు. ప‌వ‌న్ ను అభిమానించిన ప్ర‌తీ ఒక్క‌డూ గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అని చెప్పారు. టీడీపీకి ఓటు వేయ‌మ‌ని పవన్ చెప్ప‌డం వ‌ల్ల వైకాపాకి ఏ విధంగా న‌ష్టం చేయ‌గ‌లుగుతారు అని ప్ర‌శ్నించారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అబ‌ద్ధాలు న‌మ్మిన‌వారు, ప‌వ‌న్ అభిమానులు, మోడీ హ‌వాకి ప్రభావితం అయినవారు.. అందరూ క‌లిసి టీడీపీకి అధికారంలోకి తెచ్చినా, వైకాపాతో ఉన్న ఓట్ల తేడా 5 ల‌క్ష‌లు మాత్ర‌మే అని లెక్క‌లు చెప్పారు. కాబ‌ట్టి, ప‌వ‌న్ వ‌ల్ల రాబోయే ఎన్నికల్లో ప్ర‌త్యేకంగా జ‌రిగే న‌ష్టం అంటూ ఏదీ ఉండ‌ద‌న్నారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తు ఉంటుందీ, తెలుగుదేశం వ్య‌తిరేక శ‌క్తుల‌ను క‌లుపుకుని వెళ్లే ఆలోచ‌న ఉందా అనే అంశాల‌ను ఎన్నిక‌ల ముందు ఆలోచిస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు.

జ‌న‌సేన‌ను జ‌గ‌న్ కాస్త లైట్ గా తీసుకుంటున్నారు. అంతేకాదు, ప‌వ‌న్ అభిమానులంద‌రినీ టీడీపీ ఓట‌ర్లుగానే చూస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ అభిమానులంతా టీడీపీకి ఓట్లేశారు క‌దా అని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా వారు అదే ప‌ని చేస్తారంటూ జ‌గ‌న్ సూత్రీకరించేయడం గమనార్హం. నిజానికి, గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ప్ర‌భావం ఏ స్థాయిలో ఉందీ అనేది జ‌గ‌న్ కు తెలియ‌ని విష‌యం కాదు. గ‌త ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే.. .వైకాపా క్యాంపులో ప్ర‌ధానంగా వినిపించిందే ప‌వ‌న్ కల్యాణ్ పేరు. ప‌వ‌న్ రంగంలోకి దిగ‌బ‌ట్టే త‌మ ఓట్లు చీలిపోయాయ‌ని వైకాపా పెద్ద‌లు నాడు విశ్లేషించుకున్నారు. ఆ గతానుభవాలను జగన్ మరచిపోయారో, లేదా పవన్ కు ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టం లేక ఇలా మాట్లాడారో తెలీదు.

ఒక పూర్తిస్థాయి స్వతంత్ర పార్టీగా, అత్యంత ప్ర‌భావశీల‌మైన శ‌క్తిగా ఎదిగేందుకు జనసేనకు కొంత స‌మ‌యం ప‌డుతుందేమోగానీ, ఒక మిత్ర‌ప‌క్షంగా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల సామర్థ్యం ప్ర‌స్తుతానికి జ‌న‌సేన‌కు ఎంతో కొంత ఉందనేది వాస్త‌వం. నిజానికి, జ‌న‌సేన‌ను ఇలా దూరంగా పెట్టాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ కు లేదు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేవారితో క‌లిసి ప‌ని చేస్తామ‌ని ప‌వ‌న్ అంటుంటే… అలాంటి అవ‌కాశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశం జ‌గ‌న్ కు ఏ కోశానా లేదు అనేది అర్థ‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.