తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణంలో సిద్ధాంతి గంటా మురళీకృష్ణ ప్రసాద్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతక ఫలాలను వెల్లడించారు. ఈ ఏడాది జగన్కు గ్రహ గతులు అంత సానుకూలంగా లేవని, రాజపూజ్యం 1 ఉండగా, అవమానం 7 గా ఉందని ఆయన తేల్చారు. అదే సమయంలో ఆదాయ వ్యయాలు 8,11గా తేల్చారు.
పండితుడి విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది జగన్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. గౌరవ మర్యాదలు తక్కువగా ఉండి, అవమానాలు అధికంగా ఉండే అవకాశం ఉందని పంచాంగం చెబుతోంది. రాజకీయగా ఒత్తిడి పెరగవచ్చని, ప్రతి అడుగులోనూ ఆచితూచి వ్యవహరించాలని సిద్ధాంతి సూచించారు. గ్రహ దోషాలు ఉన్నప్పటికీ పట్టుదల వదలొద్దని పండితులు హితవు పలికారు. పరిహారదోషాలు చేసుకోవాలన్నారు.
సెప్టెంబర్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని, దైవబలం తోడైతే ప్రతికూలతలను అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ సారి పంచాంగ శ్రవణానికి వైఎస్ జగన్ తో పాటు ఆయన సతీమణి భారతికూడా హాజరయ్యారు. వైఎస్ జగన్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.


