ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ విశ్లేషణలో ఒక ముతక వాడుక పదాన్ని వాడారు. అది జగన్ సతీమణిని ఉద్దేశించినది కాకపోయినా, పరుషంగా ఉందని భావించి పత్రికలో ఆ పదాన్ని ముద్రించకుండా నిలిపివేశారు. ఆర్కే స్వయంగా ఆ వాడుక వాక్యం విషయంలో జాగ్రత్త వహించినప్పటికీ, వైసీపీ దీనిని ఒక ఆయుధంగా మలుచుకుంది
ఏబీఎన్ ఆఫీసు ముట్టడి – వైసీపీ అత్యుత్సాహం
జగన్ పిలుపుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగారు. ఆర్కే తప్పు అని భావించి ఆ పదాన్ని తొలగించడమే వైసీపీకి దొరికిన అతిపెద్ద అవకాశంగా మారింది. తప్పు ఒప్పుకున్నట్టే కదా అనే కోణంలో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే, ఇదే సమయంలో వారు వాడిన భాష, చేసిన ఆందోళనలు పాత్రికేయ విలువలపై దాడిలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత దూషణల కంటే, ఆ పదం వెనుక ఉన్న భావం కంటే, దానిని రాజకీయం చేయడానికే వైసీపీ ప్రాధాన్యతనిచ్చింది.
ప్రజా సమస్యలపై లేని పోరాటం
వైసీపీ తీరుపై సామాన్య ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. ఒక పదం కోసం ఇంతలా స్పందించే జగన్ రెడ్డి .. ప్రజా సమస్యలపై ఎందుకు పోరాడటం లేదు? ప్రజల కష్టాల కంటే తన కుటుంబ ప్రతిష్ట, వ్యక్తిగత ఆక్రోశానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారనే భావన ఈ ఆందోళనల ద్వారా బలపడుతోంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల గొంతుకగా నిలవాల్సిన పార్టీ, కేవలం ఒక పత్రికాధిపతిపై పగ తీర్చుకోవడానికే పరిమితం కావడం పార్టీ అధినేత నైజాన్ని బయట ప ెడుతోంది.
జగన్ రెడ్డి మార్క్ రాజకీయం
జగన్ రెడ్డి తన కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగే రాజకీయాలకే పరిమితమవుతున్నారనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది. గతంలోనూ అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత అంశాలకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజలు తమ కష్టాలను వినే నాయకుడిని కోరుకుంటున్నారే .. పదాల కోసం రోడ్లపైకి వచ్చి గొడవలు చేసే నాయకుడిని కాదు. ఈ తీరు చూస్తుంటే, జగన్ రెడ్డి ప్రజలను తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారే తప్ప, వారిని నిజంగా గౌరవించడం లేదని అర్థం చేసుకోవచ్చు.
ఆర్కే వాడిన పదం వివాదాస్పదమే కావచ్చు, కానీ దానిని సరిదిద్దుకున్న తర్వాత కూడా ఇంత రచ్చ చేయడం వెనుక రాజకీయ పరమైన అజెండా కనిపిస్తోంది. వైసీపీ ప్రజల పక్షాన నిలబడి నిరసనలు చేసి ఉంటే ఆ పార్టీకి మైలేజీ వచ్చేది. కానీ, కేవలం ఒక మీడియా సంస్థను టార్గెట్ చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి రాకపోగా, పార్టీపై మరింత వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
